Apr 13,2023 00:07
మాట్లాడుతున్న మండవ ఫౌండేషన్‌ నిర్వాహకులు

ప్రజాశక్తి-బాపట్ల: ప్రజల ఆరోగ్య రక్షణ పర్యావరణ పరిరక్షణపై ఆధారపడి ఉందని, దీనిపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని హైదరాబాద్‌ మండవ ఫౌండేషన్‌ చైర్మన్‌ మండవ ఆషాప్రియ అన్నారు. బుధవారం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అశ్విని సంచార వైద్యశాలకు మండవ ఫౌండేషన్‌, ఎన్‌ఎస్‌ఎల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ సౌజన్యంతో సమకూర్చిన నూతన సంచార వైద్య వాహనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆషాప్రియ మాట్లాడుతూ సేవ చేయడం వల్ల మానసిక ఆనందంతోపాటు శారీరకంగా ఆరోగ్యంగానూ ముందుకు సాగగలమని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే ప్రజలకు ఎంత ఆరోగ్యం అందించినా నిరుపయోగమేనన్నారు. విషతుల్యమవుతున్న వాతావరణ పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవడానికి స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుకు రావాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో పర్యావరణం పరిరక్షణపై విలువలతో కూడిన విద్యను నేటి తరం విద్యార్థులకు అందించాలన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందనే అంశాన్ని గుర్తెరగాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిన బూనాలన్నారు. కార్యక్రమంలో గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు కేఎస్‌ఎన్‌ చారి, మానం మల్లీశ్వరి, గౌతమ్‌ జి, సంచార వైద్యశాల వైద్యులు డాక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.