ప్రజాశక్తి -గాజువాక : 'పర్యావరణం కాపాడేందుకు మొక్కలు నాటాలి' అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మంగళవారం ఆవిష్కరించారు. అగనంపూడి పినమడకలోని మల్టీపర్పస్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. మొక్కలు కావలసినవారు ఆధార్ కార్డు పట్టుకొని వస్తే నాలుగు మొక్కలు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు జగదీష్, మాజీ అధ్యక్షులు పరంధామయ్య మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్ 7.3 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేస్తోందని, దానికనుగుణంగా 70 వేల పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపారు. ఇళ్లు, పాఠశాలలు, సామాజిక భవనాలు, పార్కుల్లో విరివిగా పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. అగనంపూడి హార్టికల్చర్ సొసైటీ అధ్యక్షులు నెల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.










