Aug 11,2023 21:25

ప్రజాశక్తి - ఉండి
             ప్రతిఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్‌ ప్రశాంతి కోరారు. మండలంలోని వాండ్రం గ్రామంలో ఉపాధి హామీ చట్టం ఆధ్వర్యంలో నిర్వహించిన నా మట్టి నాదేశం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ముగింపు వేడుకల్లో భాగంగా ప్రతి గ్రామంలోని పంచాయతీల వద్ద అమరవీరుల జ్ఞాపకార్థం శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లు వారు తెలిపారు. అమర వీరులను, స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకోవడం ఆనందదాయకమన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. గ్రామంలోని జగనన్న కాలనీల్లో నిర్మించే ఇళ్లకు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.20 వేలు ఇస్తానని గ్రామ సర్పంచి దాసరి వెంకటకృష్ణ ఇచ్చిన హామీ మేరకు రూ.వేల చెక్కును లబ్ధిదారునికి కలెక్టర్‌ పి.ప్రశాంతి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి మద్ద స్వరూప శ్యామ్‌, ఎంపిటిసి సభ్యులు పెన్మెత్స రామకృష్ణ ఆంజనేయరాజు, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున్‌, డ్వామా పీడీ రాజేశ్వరరావు, ఎంపిడిఒ అడబాల వెంకట అప్పారావు, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ వీరాస్వామి నాయుడు, మండల వ్యవసాయ అధికారి బి.సంధ్య, మాజీ సర్పంచి యాడంగి ఏసు, గ్రామ పంచాయతీ కార్యదర్శి జడ్డు వెంకట తాత నాయుడు, గ్రామ రెవెన్యూ అధికారి ఎస్‌.చిన్నారావు, గృహ నిర్మాణ శాఖ ఎఇ రామకృష్ణంరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
          పాలకొల్లు రూరల్‌ :మండలంలోని సగం చెరువు గ్రామంలో నా దేశం నా భూమి కార్యక్రమం సర్పంచ్‌ కడలి నాగమణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపిడిఒ సంఘాని వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 75 పండ్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి శీలం సత్యనారాయణ, గుడాల చిననాగేశ్వరరావు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోతురాజు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
పెనుమంట్ర :ప్రతిఒక్కరూ బాధ్యతగా ఇంటి వద్ద, పరిసర ప్రాంతాల్లోనూ మొక్కలు నాటాలని జుత్తిగ సర్పంచి తమనంపూడి వీర్రెడ్డి పిలుపునిచ్చారు. నా భూమి - నా దేశం కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు పరిధిలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
          మొగల్తూరు :పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు సూచించారు. మొగల్తూరులోని మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉన్న అమృత్‌ సరోవర్‌ చెరువు వద్ద ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నా మట్టి -నా దేశం, నేల తల్లికి నమస్కారం - వీరులకు వందనం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ, జెడ్‌పిటిసి సభ్యులు తిరుమాని బాపూజీ, వైస్‌ ఎంపిపి కైలా సుబ్బారావు, ఎంపిటిసి సభ్యులు తిరుమాని నాగరాజు వరలక్ష్మి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బంధన పూర్ణచంద్రరావు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు అండ్రాజు చెల్లరావు, ఇఒపిఆర్‌డి నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.
             తాడేపల్లిగూడెం : శశి ఇంజినీరింగ్‌ కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్లు నా భూమి నా దేశంలో భాగంగా శుక్రవారం కొండ్రుప్రోలు గ్రామంలో మొక్కలు నాటారు. గ్రామ సచివాలయం వద్ద తొలుత విద్యార్థులు, సచివాలయ సిబ్బంది పంచ ప్రాణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి వై.హరికిషోర్‌ మాట్లాడారు. తమ గ్రామానికి వచ్చిన శశి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులను, ప్రోత్సహిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ సల్మాన్‌ బాషా, విద్యార్థులు, కొండ్రుప్రోలు గ్రామ పెద్దలు రిటైర్డ్‌ హెచ్‌ఎం సనివరపు కృష్ణశాస్త్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను కళాశాల ఛైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్‌ ఛైర్మన్‌ మేకా నరేంద్ర కృష్ణ, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ అభినందించారు.
         పాలకొల్లు : పాలకొల్లు జోన్‌ ప్రయివేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ ఉత్సవ్‌ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం క్రీడా పోటీలు నిర్వహించారు. పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాలకు సంబంధించిన సుమారు 35 ప్రయివేట్‌, ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌కు చెందిన సుమారు 600 మంది విద్యార్థులకు శుక్రవారం పాలకొల్లులోని నాగరాజుపేట గురుకుల విద్యాలయాలో పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు పాలకొల్లు ఎంఇఒ గుమ్మళ్ల వీరాస్వామి బహుమతులు అందించారు. పట్టణంలోని డాక్టర్‌ అబ్దుల్‌ కలాం పార్క్‌లో నా భూమి- నా దేశం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ శేషాద్రి సారధ్యంలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
         ఆకివీడు : నా మట్టి -నాదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ హైమావతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలరు పాల్గొన్నారు.