Jul 28,2023 20:28

మొక్క నాటుతున్న కలెక్టర్‌, ఎస్‌పి, జెసి

రాయచోటి : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని, దానిని బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్‌ గిరీష అన్నారు. శుక్రవారం మండలంలోని దిగువ అబ్బవరం గ్రామ పంచాయతీ నక్కలవాండ్లపల్లి సమీపంలో క్రికెట్‌ స్టేడియం చుట్టూ, స్టేడియం రోడ్డు కిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌, ఎస్‌పితో పాటు జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆయన తల్లి ఖుష్నుమాబేగం, కలెక్టర్‌ సతీమణి స్నేహా, ఎస్‌పి సతీమణి అర్‌.పద్మజ, కమిషనర్‌ సతీమణి లావణ్య, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, సర్పంచ్‌ మమత హాజరై మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో బాగంగా పచ్చదనం పెంపుదలకు జిల్లా వ్యాప్తంగా విస్తతంగా మొక్కలను విరివిగా నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ఇందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలన్నారు. మన చుట్టూ ఉన్న ప్రదేశాలు పచ్చదనంతో నిండి ఉన్నట్లయితే వాయుకాలుష్యం కాకుండా మొక్కలు తోడ్పడతాయని, స్వచ్ఛమైన ప్రాణవాయువు అందిస్తాయన్నారు. ఇప్పుడు మనం నాటిన మొక్కలు భావితరాలకు ఫలాలను అందిస్తాయన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఎస్‌పి గంగాధర్‌రావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని, అప్పుడే పచ్చదనాన్ని పెంచుకోవచ్చన్నారు. మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. పచ్చదనం పెరిగినప్పుడే గాలిలో ఆక్సిజన్‌ పెరగడంతో పాటు వాయు కాలుష్యం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ రంగస్వామి, మున్సిపల్‌ కమిషనర్‌ గంగప్రసాద్‌, డ్వామా సీడీ మద్దిలేటి, డిఇఒ పురుషోత్తం, ఎపిఐఐసి డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, తహశీల్దార్‌ హేమంతకుమార్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.