Jul 28,2023 23:20

ప్రజాశక్తి-కాకినాడ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఒఎన్‌జిసి హెచ్‌ఆర్‌ మేనేజర్‌ మహ్మద్‌ అన్వర్‌, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు సూచించారు. కాకినాడ బస్టాండ్‌లో శుక్రవారం ఒఎన్‌జిసి, ఆలిండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, పకృతి సమతుల్యతపై సదస్సు నిర్వహించారు. ఈ ఈ సదస్సులో మహమ్మద్‌ అన్వర్‌, శ్రీనివాసరావు మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడడానికి తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై సూచించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా మానివేయాలని, ప్లాస్టిక్‌ స్థానంలో జ్యూట్‌ బ్యాగులు, గుడ్డ సంచులు ఉపయోగించాలని కోరారు. అనంతరం ఒఎన్‌జిసి ఆర్థిక సాయంతో ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ సుమారు 200 జూట్‌ బ్యాగులను బస్‌ స్టేషన్‌లో అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ఎంయువి మనోహర్‌, ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షురాలు భానుమతి, ట్రెజరర్‌ పద్మజవాణి, సభ్యులు విజయలక్ష్మి మీనాక్షి రత్నగిరి, ఉష అలివేణి, కామేశ్వరి, పద్మలత, కాకినాడ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ టి.బాలకృష్ణ, స్టేషన్‌ మేనేజర్‌ జి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.