Feb 25,2022 06:58

జీవ వైవిధ్య చట్టానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణల పుణ్యమా అని ఎలాంటి అనుమతులు లేకుండానే పేటెంట్‌ హక్కులు పొంది...స్థానిక గిరిజనులకు పరిహారాన్ని ఇవ్వనక్కర్లేకుండా దేశీయ కంపెనీలకేగాక విదేశీ బహుళజాతి కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఇక మీదట మన అరుదైన వృక్ష సంపదపై మాన్‌శాంటో వంటి బహుళజాతి కంపెనీలకు పేటెంటు హక్కులు లభిస్తే బిటీ కాటన్‌ వలె మన వ్యవసాయం వారి ఆధీనంలోకి పోయే ప్రమాదం వుంది.

ప్రస్తుతం అమలులో వున్న జీవ వైవిధ్య చట్టానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖా మంత్రి గత పార్లమెంటు సమావేశాల్లో కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఇవేగనక అమలు లోకి వస్తే... అరణ్య ప్రాంతాల్లో వున్న అరుదైన ఔషధ మొక్కలను, మూలికలను, గిరిజన, రైతు బాహళ్యం అనాదిగా సాగు చేసుకొనే విత్తనాలను, పంట రకాలను వినియోగించుకొనేందుకుగాను ఇకపై ఎటువంటి ప్రభుత్వ సంస్థల అనుమతులు లేకుండానే ప్రైవేటు భారత, విదేశీ ఔషద కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది.
     మరోవైపు ఈ సవరణలను పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, గిరిజన, రైతు సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విశిష్ట లక్షణాలు కల్గిన ఔషధ మొక్కలు, విలువైన పంటల రకాలు పట్టణీకరణ, వాతావరణ మార్పులు, అక్రమ రవాణా కారణంగా ఇప్పటికీ వేగంగా అంతరించిపోతున్నాయి. వీటిలో చాలా మొక్కలు ఆయుర్వేదం, వ్యవసాయంలో ఉపయోగించాలే తప్ప మార్కెట్‌లో ఇతర ''వ్యాపార వస్తువులు''గా పరిగణించరాదు. ఒకవేళ ఆవిధంగా చేసినట్లయితే, ఔషధ కంపెనీల మితిమీరిన వినియోగంతో అరుదైన వృక్ష సంపదను లాభాల కోసం కోల్పోవాల్సి వస్తుంది. దాంతో అటు పర్యావరణానికి ఇటు గిరిజనులు, రైతుల జీవనోపాధికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
    హిమాలయ, ఈశాన్య ప్రాంతాల పశ్చిమ, తూర్పు కనుమల్లోను, గుజరాత్‌ లోని అరణ్యాల్లో కొండకోనల్లో అనేక వృక్షాలు, ఎన్నో ఔషధ మొక్కలున్నాయి. మనం తరచూ వినియోగించే క్రోసిన్‌, సింకోరా (మలేరియా) తదితర అల్లోపతి ఔషధాలు మన దేశంలోని అరుదైన చెట్ల బెరళ్లు, వేళ్లు, మూలికల నుండి పొందిన సహజ రసాయనాల ఆధారంగా రూపొందించినవే. ఢిల్లీ లోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐ.సి.ఎ.ఆర్‌) విత్తన బ్యాంకులో 96 వేల బియ్యం రకాలు భద్రపర్చబడినవంటే ఆశ్చర్యం కలుగక మానదు. గతంలో వరిలో బంగారు తీగలు, అక్కుళ్ళు వగైరా రకాలు ఏ కిరాణా దుకాణానికి వెళ్ళినా లభించేవి. కానీ ఈనాడు వరిలో సైతం మూడు లేక నాలుగు రకాలు మించి సాగు కావటం లేదు. అమృతపాణి, చక్రకేళి దాదాపుగా అంతరించిపోయాయి. పంటలు, వివిధ మొక్కల రకాలు తగ్గి ప్రకృతి నుండి అదృశ్యం కావటాన్నే కుంచించుకుపోతున్న 'జీవ వైవిధ్యం'గా పేర్కొంటారు.
    మొక్కల్లోని వైవిధ్యం మానవుని ఆరోగ్యానికే (పోషక విలువలకు) కాక పర్యావరణానికి, సృష్టిలో మనుషుల, పక్షుల, జంతువుల, మనుగడకు అత్యావశ్యకం. అమృతపాణి అరటిపళ్లు, 'తైమ్‌', 'అతిబాల' వంటి మొక్కలు ప్రకృతి నుండి అదృశ్యమైతే ముందు తరాల వారికి కనీసం అవి మ్యూజియంలో కూడా కానరాని పరిస్థితి దాపురిస్తుంది. ఈ విలువైన సంపదను ముందు తరాల అవసరాలను సంరక్షించుకోవాలి.
   వీటి పరిరక్షణకు ''జీవ వైవిధ్య చట్టం-2002' కొన్ని చర్యలు చేపట్టింది. వీటిని సక్రమంగా వినియోగించుకోవటానికి కేంద్రంలో ఒక సంస్థ (నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీ) ఏర్పాటైంది. వివిధ రాష్ట్రాల్లో బయోడైవర్సిటీ బోర్డులు నిర్వహింపబడ్డాయి. ఆరు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో జరిగిన 'అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు' అనేక విలువైన సూచనలు చేసింది. ఏదైనా ఔషధ సంస్థ, కంపెనీ, ఆహార శుద్ధి పరిశ్రమ, దేశీ, ఆయుర్వేద, యునానీ వైద్యులు... అరణ్యాలు, కొండల్లోని అరుదైన మొక్కల్ని వ్యాపారరీత్యా పొందాలంటే ప్రభుత్వ బయోడైవర్సిటీ సంస్థల నుండి తప్పక అనుమతులు పొందాలి. ఈ వృక్ష సంపదను, వనమూలికలను సాగు చేస్తూ, సంరక్షించే ఆ ప్రాంత గిరిజనులకు...ప్రతిఫలంగా కొంత రుసుమును చెల్లించాలి. పొందిన లాభాల్లో కొంత భాగం గిరిజనుల సంక్షేమానికి (స్థానికంగా వారికి పాఠశాలలు, ఆస్పత్రులు వగైరా నెలకొల్పటానికి) వినియోగించాలి. అనాదిగా గిరిజనులకు వృక్ష సంపదపైనున్న జ్ఞానాన్ని పరిరక్షించాలి. ఇది మానవాళి నాగరికతలో అంతర్భాగం.
    దేశంలోని వివిధ అరణ్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20 కోట్ల మంది గిరిజనులు, గ్రామీణ పేదలు అటవీ ఉత్పత్తుల, వన మూలికలు, ఔషధ పంటల సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వామపక్షాల ఒత్తిడి మేరకు నాటి యు.పి.ఎ ప్రభుత్వం ఆదివాసి, గిరిజనులకు ఈ ఉత్పత్తులు అనుభవించటానికి గాను, పోడు తదితర భూములపై పరిమితంగానైనా కొన్ని హక్కులు కల్పించింది. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ''నగోయా'' పర్యావరణ సదస్సు సూచించిన నిబంధనావళి లోని ఆర్టికల్‌ 5 ప్రకారం అటవీ ఉత్పత్తులు, ఔషధ, అరుదైన పంట రకాల వినియోగం ద్వారా లభించే లాభాలను విధిగా గిరిజన, ఆదివాసీ, రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఈ నిబంధనలకు మన పార్లమెంటు గతంలో చట్టపరంగా హక్కులు కల్పించింది.
    కాగా 2016లో ఉత్తరాఖండ్‌ లోని ''దివ్య'' ఆయుర్వేద కంపెనీ హిమాలయాల్లోని అడవుల నుండి పెద్ద సంఖ్యలో అనేక అరుదైన ఔషధ మొక్కలను ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా చౌర్యం చేసింది. విశేషమేమంటే దివ్య ఫార్మసీ ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్తగా మారిన వివాదాస్పద రామ్‌దేవ్‌ బాబాకు చెందిన ఔషధ సంస్థ. 'జీవ వైవిధ్య చట్టం-2002'ను అతిక్రమించి అరుదైన ఔషధ మొక్కలను ప్రభుత్వ సంస్థల అనుమతులు లేకుండా పరిశ్రమల్లో వినియోగించి, తద్వారా లభించిన లాభాల్లో భాగాన్ని స్థానిక గిరిజనులకు ఇవ్వడానికి నిరాకరించినందుకు ఉత్తరఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వ్యాజ్యం వేసింది. ఈ ఉల్లంఘనను తీవ్రమైనదిగా పరిగణిస్తూ హైకోర్టు దివ్య ఫార్మసీపై జుర్మానా విధిస్తూ ఆ పరిశ్రమ నిర్వహణకు సంబంధించి కఠినమైన షరతులు విధించింది. ఈ చర్యను జీర్ణించుకోలేని రామ్‌దేవ్‌ బాబా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి...ప్రైవేటు ఔషధ పరిశ్రమలు, ఆయుష్‌ సంస్థలు ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఔషధ మొక్కలను పొందటానికి వీలుగా... జీవ వైవిధ్య చట్టం-2002కి తూట్లు పొడిచే సవరణలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
    గత ఇరవై సంవత్సరాల్లో భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన వేప, పసుపు, వంగ, బాస్మతి వరి, బంగినపల్లి రకాలపై మేధోసంపత్తి హక్కులు (పేటెంట్లు) పొంది...వాటిని తస్కరించేందుకు ఔషధ, ఆహార బహుళజాతి విదేశీ కంపెనీలు ప్రయత్నించాయి. మన ప్రజా సంఘాలు, సంస్థలు చేసిన ఒత్తిడి మేరకు...ఈ 'జీవ వైవిధ్య చట్టం-2002' సహకారంతో... భారత ప్రభుత్వం దీర్ఘకాలం పోరాడి ఈ సంపదను విదేశీ కంపెనీలు కాజేయకుండా రక్షించుకోగల్గింది.
    జీవ వైవిధ్య చట్టానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణల పుణ్యమా అని ఎలాంటి అనుమతులు లేకుండానే పేటెంట్‌ హక్కులు పొంది...స్థానిక గిరిజనులకు పరిహారాన్ని ఇవ్వనక్కర్లేకుండా దేశీయ కంపెనీలకేగాక విదేశీ బహుళజాతి కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది.
    ఉదాహరణకు రైతులకు ఎంతో పంట నష్టం కలిగిస్తున్న అగ్గి తెగులును తట్టుకొనే వరి వంగడాలను రూపొందించాలంటే క్రాసింగ్‌ కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలకు తూర్పు కనుమల్లోని ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుండి కొన్ని కొండజాతి వరి రకాలు అవసరం అవుతాయి. ఇక మీదట మన అరుదైన వృక్ష సంపదపై మాన్‌శాంటో వంటి బహుళజాతి కంపెనీలకు పేటెంటు హక్కులు లభిస్తే బిటీ కాటన్‌ వలె మన వ్యవసాయం వారి ఆధీనంలోకి పోయే ప్రమాదం వుంది. అందుకే దేశ ఆహార భద్రతకు, పర్యావరణానికి, గిరిజనుల, రైతుల ప్రయోజనాలకు హని కల్గించే ఈ చట్ట సవరణలను వెనక్కి తీసుకోవాలి. పలువురు శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, జనవిజ్ఞాన వేదిక ఇటీవల (జనవరి 30న) నిర్వహించిన అంతర్జాల సదస్సు ద్వారా పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఇదే కోరాయి.
 

/ వ్యాసకర్త : ఐసిఎఆర్‌ ఎన్‌.బి.పి.జి.ఆర్‌ లో ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ , న్యూఢిల్లీ/

డా|| సోమమర్ల