Oct 04,2022 23:30

అరకులోయ మ్యూజియం వద్ద పర్యాటక కళకళ

వేలాదిగా తరలివస్తున్న సందర్శకులు
టిక్కెట్ల రూపేణా భారీగా ఆదాయం
మూడేళ్ల తర్వాత కనిపిస్తోన్న దసరా సందడి
ప్రజాశక్తి- అరకులోయ:
పర్యాటకుల తాకిడి పెరగడంతో ఆంధ్రా ఊటీ అరకులోయలో సందడి నెలకొంది. అరకులోయ పట్టణం కిటకిటలాడుతోంది. గత మూడేళ్లుగా కరోనా ప్రభావంతో వెలవెలబోయిన సందర్శిత ప్రాంతాలు, అరకులోయ పట్టణం, ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. దీంతో అరకులోయ టౌన్‌షిప్‌తోపాటు, ఇక్కడి సందర్శక ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. ఏ పర్యాటక ప్రాంతాలకు వెళ్లినా సందర్శకులతో సందడి వాతావరణం కనిపిస్తోంది. పర్యాటకులు భారీగా తరలిరావడంతో ఆయా సందర్శిత ప్రాంతాల్లో టిక్కెట్ల రూపేణా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది.
అరకులోయ గిరిజన సంస్కతి మ్యూజియంలో ఆదివారం రూ.2 లక్షల 43 వేలు ఆదాయం సమకూరగా, సోమవారం రూ. లక్షల 6వేల ఆదాయం వచ్చింది. మంగళవారం రూ. 2లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు మ్యూజియం మేనేజర్‌ మురళి తెలిపారు.ఈ మూడు రోజుల్లో సుమారుగా పదివేల మందికి పైగా పర్యాటకులు సందర్శించినట్లు అంచనా. అలాగే పద్మావతి ఉద్యాన కేంద్రం, డుంబ్రిగూడ చాపరాయి జలపాతంలో కూడా వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శించి సందడి చేశారు. అనేకమంది పర్యాటకులు రూములు దొరక్క ఇబ్బందులు పడి ప్రైవేటు వాహనాల్లో వెనుతిరిగారు. సోమ, మంగళ వారాల్లో వర్షం కురిసినా, అనేక ఇబ్బందులు పడినా పర్యాటకులు లెక్క చేయకుండా అరకులోని అందాలను తనివితీరా చూశారు. వరుసగా మూడేళ్లపాటు కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమైన పర్యాటకులు ఇప్పుడు పెద్దగా తరలివస్తున్నారు. దసరా సెలవులు కావడమే పర్యాటకుల తాకిడి పెరగడానికి కారణంగా చెబుతున్నారు.