Jun 04,2023 23:36

స్నానాలు చేస్తున్న పర్యాటకులు

ప్రజాశక్తి -పాడేరు:మండే ఎండలతో అల్లాడుతున్న జనం వేసవి ఉపశమనం కోసం మైదాన ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మన్యానికి కదిలి వస్తున్నారు. చెట్లు చామలు, జలపాతాలతో మన్యంలో కాస్త ఉండే చల్లదనాన్ని ఆస్వాదించడానికి వస్తున్న పర్యాటకులు, సందర్శకులకు ఏజెన్సీలో ఉపశమనం లభిస్తుందని చెప్పాలి. ఈ మేరకు ఆదివారం పాడేరుకు సమీపంలోని జిమాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. ఇక్కడున్న జలపాతంలో పిల్లలు, పెద్దలు, మహిళలు సైతం జలకాలాటలో మునిగిపోయారు. ఎండ వేడి దహిస్తున్న మధ్యాహ్నం సమయానికి ఇక్కడ కురిసిన భారీ వర్షం పర్యాటకులను మరింత మురిపించింది. జోరు వానలోనూ జలపాతంలో సందర్శకులు జలకలాడుతూ సందడి చేశారు. ఓవైపు జలకాలాటలతో మరోవైపు కాసేపు కురిసిన వర్షంతో పర్యాటకులు ఎంతో ఆహ్లాదాన్ని పొందారు.