పర్యాటకుల భద్రతే లక్ష్యం
- టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
- నంద్యాల జిల్లా ఎస్‌పి కె.రఘువీర్ రెడ్డి
ప్రజాశక్తి - మహానంది
పర్యాటకుల భద్రతే లక్ష్యంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిరస్మరణీయమని నంద్యాల జిల్లా ఎస్‌పి రఘువీర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. మహానంది క్షేత్రంలో ఏర్పాటు చేసిన టూరిస్టు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో జిల్లా ఎస్‌పి పాల్గొని మాట్లాడారు. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారి భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్‌లు లోకల్ పోలీస్ స్టేషన్‌లతో అనుసంధానమై ఉంటాయని అన్నారు. ప్రతి టూరిస్ట్ పోలీస్ స్టేషన్‌లో 6 మంది సిబ్బంది షిఫ్ట్ డ్యూటీలుగా పని చేస్తారని తెలిపారు. వీరిలో సగం ఆడవారు, సగం మగవారు పని చేస్తారని చెప్పారు. టూరిస్ట్ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేక టెలిఫోన్ నెంబరు ఏర్పాటు చేస్తామని, ఒక విహెచ్‌ఎఫ్ సెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపు, ఎమర్జెన్సీ టెలిఫోన్ నంబర్స్, ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులకు భద్రత కల్పిస్తారని తెలిపారు. నంద్యాల జిల్లాలో మహానంది, అహౌబిలం, శ్రీశైలం పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయని, శ్రీశైలంలో కూడా టూరిస్ట్ పోలీస్ స్టేషన్ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట, నేరాల నియంత్రణే లక్ష్యంగా దేవదాయ శాఖను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మహానంది ఆలయ ఇఒ చంద్రశేఖర్ రెడ్డి, పాలక మండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, నంద్యాల డిఎస్‌పి మహేశ్వర్ రెడ్డి, రూరల్ సిఐ రవీంద్ర, మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి, పోలీస్ సిబ్బంది, ఆలయ అధికారులు పాల్గొన్నారు.










