ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: పర్యాటక రంగాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ఎనలేని కృషి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఆమె ఆదివారం అల్లూరి జిల్లా లంబసింగిలో ఓ రిసార్ట్స్‌ను ప్రారంభించేందుకు వెళుతున్న సందర్భంగా స్థానిక రాయల్ రిసార్ట్స్‌లో విడిది చేసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని, దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎంత గానో కృషి చేస్తుంన్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో పర్యాటక రంగం రాష్ట్రంలో అభివృద్ధి చెంది మూడవ స్థానంలో నిలిచిందని ఆమె అన్నారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాతిపదికన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నెల రోజులు పాటు జగనన్న సాంస్కతిక సంబరాలు, యూత్ ఫెస్టివల్‌లో భాగంగా యువతలో దాగిన కళారంగాన్ని వెలికి తీస్తున్నామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, సుందర దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులకు వీలు కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు ప్రజలు కోవిడ్ కారణంగా ఇంటికి పరిమితమయ్యారని, ప్రస్తుతం ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యటక రంగాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆంధ్ర ఊటి లంబసింగి పరిసర ప్రాంతాల్లో అనేక వాటర్ ఫాల్స్, బోట్ షికార్ ప్రదేశాలు ఉన్నాయని, వీటిని అబివృద్ధి చేసి, పర్యాటకులకు అనుకూలంగా ఉండే విధంగా రిసార్ట్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గొలుగొండ మండలంలో అల్లూరి సీతారామరాజు పార్కు, పుణ్యక్షేత్రమైన ధారమఠం ప్రదేశాన్ని తీర్చి దిద్దుతామన్నారు.
దారమఠంను అభివృద్ధి చేయాలి
జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు
గొలుగొండ:దారమఠం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె.రోజాకు గొలుగొండ జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు వినతిపత్రం అందజేశారు. ఆదివారం లంబసింగి పర్యటనలో భాగంగా నర్సీపట్నం రాయల్ రిసార్ట్స్‌లో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు. గొలుగొండ మండలంలో సహజ వనరుగా ఉన్న దారమఠం పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు, అదే విధంగా శివాలయంనకు పార్కుని, నాతవరం, గొలుగొండ మండలాలను కలిపే రహదారిని ఆనుకుని ఉన్న తాండవ నదీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయుటకు నిధులు కేటాయించాలని కోరారు.










