ప్రజాశక్తి-అరకులోయ రూరల్:ఆంధ్రా ఊటీ అరకులోయలో పర్యాటక సందర్శక ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఓవైపు మంచు అందాలను ఆస్వాదిస్తూ, మరోవైపు ఫొటోలు తీసుకుంటూ పర్యాటకులు ఉల్లాసంగా గడిపారు. దేశ, విదేశాల నుండి పర్యాటకులు శనివారం సాయంత్రానికే అరకులోయకు చేరుకుని గుడారాలు, లాడ్జీల్లో రాత్రి బసచేసి ఉదయాన్నే మంచు అందాలను ఆస్వాదించారు. పద్మాపురం గార్డెన్, అరకులోయ గిరిజన మ్యూజియం, బొర్రా గుహలకు, డుంబ్రిగుడ చాపరాయిలో సందడి చేశారు. వలిసే పూల తోటల్లో ఫోటోలు తీసుకుంటూ అందాలని తిలకించారు. మండల కేంద్రంలోని మ్యూజియం, కళాగ్రామంలో ఉన్న జిప్‌లైన్, స్కై సైకిలింగ్ పిల్లలు, యువకులు చేస్తుండగా వారిని తల్లిదండ్రులు, బంధువులు ఉత్సాహ పరిచారు. కళాగ్రామంలో యంపీ థియేటర్ వేదికపై పర్యాటకుల కోసం థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. పద్మాపురం గార్డెన్‌లో పర్యాటకులు ట్రారుట్రైన్‌లో విహరిస్తూ అందాలను తిలకించారు. మాడగడ కొండపైన మంచు అందాల ఫొటోలు తీసుకుని అందాలను ఆస్వాదించారు.
బొర్రా గుహల్లో సందడి
అనంతగిరి:కార్తీక మాసం మూడో వారం కావడంతో ఆదివారం ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు వేలాది మంది పర్యాటకులు తరలి వచ్చారు. బొర్రా ప్రాంతమంతా సందడి నెలకొంది. వాహనాలు నిలిపివేతకు సరైన పార్కింగ్ స్థలం లేకపోవడంతో కొన్ని వాహనాలు ప్రధాన రహదారిపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్ స్తంభించింది.డముకు యూ ఫాయింట్, చిట్టంపాడు, కటికి, తాడిగుడను సందర్శించారు. కాఫీ ప్లాంటేషన్, సుంకరమెట్ట యు ఫాయింట్‌లను తిలకించారు.దీంతో అనంతగిరి, అరకు ఘాట్ రోడ్ పర్యాటకులతో సందడి నెలకొంది.










