Feb 15,2023 00:28

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి:పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలోని అమరావతి మండల కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ధ్యానబుద్ధ విగ్రహానికి ఎదురుగా స్వదేశీ దర్శన్‌ పథకం కింద రూ.15.02 కోట్లతో ఏర్పాటు చేసిన ధ్యాన బుద్ధ వనం, పర్యాటక వసతిగృహం, ధ్యాన కేంద్రం, ఇన్ఫర్మేషన్‌ సెంటర్లను రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కె రోజా, కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విదేశాల్లోని 250 రకాల భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఇనుమాడింపజేసే చారిత్రక సంపదను దేశానికి తెచ్చామని, వీటిని పలు మ్యూజియంలో సందర్శకులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. రాష్ట్రంలోనూ పలు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు, పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పర్యాటక రంగంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ అమరావతి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరింతగా సహకరించాలని మంత్రులు కిషన్‌రెడ్డి, రోజాను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ ఎమ్‌డి కె.కన్నబాబు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్‌, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎ.వరప్రసాదరెడ్డి పాల్గొన్నారు.