Jun 13,2023 00:03

సముద్ర తీరంలో స్థలాన్ని పరిశీలిస్తున్న జెసి జాహ్నవి

ప్రజాశక్తి-అచ్యుతాపురం
పూడిమడక సముద్ర తీరంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చేసిన ప్రతిపాదన స్థలాన్ని సోమవారం అనకాపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి పరిశీలించారు. సర్వే నెంబరు 85లో స్థలాన్ని పర్యాటక కేంద్రం ఏర్పాటుకు గతంలో ప్రతిపాదన చేశారు. ఈ మేరకు ఆ స్థలాన్ని పరిశీలించడానికి ఆమె రెవెన్యూ సిబ్బందితో కలిసి తీరంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్‌ చేపల వెంకటరమణ మాట్లాడుతూ పూడిమడక సర్వే నెంబరు 85లో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించిన స్థలం అనుకూలం కాదని జెసికి తెలిపారు. సముద్రం పొంగినప్పుడు పర్యాటక కేంద్రానికి ప్రతిపాదించిన స్థలం ముంపునకు గురవుతుందని ఆయన పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో పడిన వర్షం నీరు ఈ కొత్త ఏరు ద్వారా సముద్రంలో అదే ప్రదేశంలో పొంగి ప్రవహిస్తుందని, అక్కడే సముద్రంలో కలుస్తుందని ఆయన తెలిపారు. ఆమె వెంట మండల తహశీల్దారు వై శ్రీనివాసరావు, ఆర్‌ఐ కుమార్‌, గ్రామ రెవెన్యూ అధికారి శశిధర్‌ తదితరులు ఉన్నారు.