గుమ్మలక్ష్మీపురం: పర్యాటక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టరు నిశాంత్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సవరకోటపాడు హార్టికల్చరల్ నర్సరీ ట్రైనింగు సెంటర్‌ను పర్యాటక పార్కుగా చేస్తున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఒక్కొక్కటి పది లక్షల విలువ గలిగిన క్యాంటీన్, షాపింగు కాంప్లెక్స్, టాయిలెట్స్, ఆర్చ్, గేటు, పార్కింగు, కాలిబాట పనులను నవంబరులో పూర్తిచేయాలని ఆదేశించారు. రూ.20లక్షలు, రూ.15లక్షలతో నిర్మిస్తున్న కాటేజీలను, రూ.10లక్షలతో చేపట్టిన చెరువు అభివృద్ధి పనులను డిసెంబరు 15 నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పార్కులో సందర్శకులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని, జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు జె శాంతీశ్వర రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.










