
ప్రజాశక్తి -కోటవురట్ల:నర్సీపట్నం- పోలవరం రోడ్డులో అప్రమత్తంగా లేకపోతే ప్రయాణం ప్రమాదకరమే. ఈ రోడ్డుపై ప్రయాణం అంటే నిత్యం తిరిగే ప్రజలతో పాటు కొత్తగా ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే? ప్రధానంగా ఇందేసమ్మ వాక వద్ద సమీపంలోని పోలవరం కాలువ నిర్మాణంలో భాగంగా రోడ్డును తవ్వేసి వదిలేశారు. అదేవిధంగా వరహానది అనుకొని ఉన్న చిద్రమైనఘాట్ రోడ్డు వద్ద ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందని నిత్యం ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు., నర్సీపట్నం డివిజన్ కేంద్రానికి వెళ్లే రహదారి కావడంతో పాయకరావుపేట, నక్కపల్లి, రాయవరం, ఎలమంచిలి ప్రజలు నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఈ రోడ్డుని అనుకొని పోలవరం కాలువ నిర్మాణం నిమిత్తం తవ్వేసి వదిలేయడంతో వాహనదారులు, ప్రయాణికులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వాణిజ్య కేంద్రమైన తుని వెళ్లేందుకు, సమీపంలో రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం కాలువ పనులు అర్థంతరంగా నిలిచి పోవడంతో సమీపంలో రోడ్డుని అనుకొని సుమారు 20 అడుగుల లోతు వరకు తవ్వేసి వదిలేశారు. ఇదే విధంగా ఇందేశమ్మ ఘాట్ రోడ్డు వద్ద కూడా రోడ్డు చిద్రమై ఉండటంతోపాటు కొన్నిచోట్ల రోడ్డు నదిలోకి జారి ఉండటంతో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన చెబుతున్నారు. ఈ మార్గాన వెళ్లాలంటే భయ పడుతున్నారు. అధికారులు, నాయకులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.