Oct 31,2023 21:17

మాట్లాడుతున్న ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సుమంత్‌ ఆర్‌.ఆంథోని

           ప్రజాశక్తి-అనంతపురం   ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల వేళల్లో మార్పులు తీసుకురావాలని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సుమంత్‌ ఆర్‌.ఆంథోని సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో జిల్లాలోని డిపో మేనేజర్లు, డిపో ట్రాఫిక్‌ ఇన్‌ఛార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బస్‌ సర్వీసు పనితీరును తెలుసుకోవడంతోపాటు సెక్టర్‌ వారీగా పని తీరు బాగా లేని సర్వీసులను రీషెడ్యూల్‌ చేయాలని సూచించారు. అలాగే ఆర్టీసీ డోర్‌ డెలివరీ మాసోత్సవాల సందర్భంగా కార్గోలో డోర్‌ డెలివరీ సదుపాయం తీసుకొచ్చామన్నారు. దీనిపై ప్రచారం చేయాలన్నారు. కార్గో బుక్‌ చేసినప్పుడు డోర్‌ డెలివరీతో కలిపి బుక్‌ చేస్తే ఆ పార్సిల్‌ను ఇంటి వద్దకే తక్కువ ఖర్చుతో అందజేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలు జరుగు ప్రదేశాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిటీఎం రమేష్‌బాబు, డిప్యూటీ సిఎంఇ మోహన్‌కుమార్‌, డిపో మేనేజర్లు నాగభూపాల్‌, శంకర్‌, రామచంద్ర, సురేష్‌కుమార్‌, నారాయణస్వామి, ట్రాఫిక్‌ ఇన్‌ఛార్జిలు రమణమ్మ, ప్రసాద్‌, ఆర్‌.ఎం.ఆఫీస్‌ ఎస్‌టిఐ నాగర్జున, ఎఎంఎఫ్‌ సాయి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.