May 15,2022 09:01

మనం సాధారణంగా ఏదైనా విషయంలో బెస్ట్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ అని చెప్పాలంటే దాన్ని ఎవరెస్టుతో పోల్చుతాం.. ఎందుకంటే భూగోళం మీద అత్యంత ఎత్తయిన పర్వతం ఇదే. అలాంటి అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని జీవితంలో ఒక్కసారైన అధిరోహించాలన్నది ఎందరో పర్వతారోహకుల కల. అలాంటి ఎవరెస్టును అత్యధిక సార్లు ఎక్కడంలోనే బెస్ట్‌గా రికార్డు సృష్టించాడు. ఆయనే నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా. బెస్ట్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ అయిన వ్యక్తిని దేంతో పోల్చాలి? ఆయన సాధించిన రికార్డు ఏంటి? తెలుసుకుందాం..!

పర్వతారోహణలో 'ఎవరెస్ట్‌' కామి రీతా



సాహసికుల్ని ఎవరెస్టు ఎక్కించడంలో ముఖ్యపాత్ర పోషించే షెర్పాల్లో ది గ్రేట్‌గా ఖ్యాతి పొందిన ఆయన పేరు కామి రీతా. అయితే ఈ పేరు ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేలేదు. తన ప్రపంచ రికార్డులను తానే బద్దలుకొడుతోన్న కామి రీతా గురించి మరోసారి చెప్పుకునే అవకాశం మనకు కల్పించాడంతే.. అయితే నేపాల్‌కు చెందిన 52 ఏళ్ల షెర్పా కామి రీతా ఎవరెస్టును ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 26 సార్లు అధిరోహించాడు! ఆ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఈ రికార్డు ఎవరి తరం కాలేదు. తాజాగా 26వ సారి ఎవరెస్టును ఎక్కినట్టు సెవన్‌ సమ్మిట్‌ ట్రెక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మేనేజర్‌ దావా షెర్పా వెల్లడించారు.
కాగా ఆయన రికార్డుల గురించి ఎవరు ఎన్ని ఉపమానాలు రాసినా, తాను మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ డౌన్‌ టు ఎర్త్‌ అనే చెప్పుకుంటాడు. అలానే వ్యవహరిస్తాడు కూడా.
10 మంది పర్వతారోహకులతో...
తాజాగా షెర్పా కామి రీతా 10 మంది పర్వతారోహకుల బృందానికి నేతృత్వం వహిస్తూ ఇటీవలే ఎవరెస్టు శిఖరం పైకి వెళ్లాడు. గత ఆదివారం ఆ బృందం విజయవంతంగా ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరుకుంది. కాగా రీతా తన 24వ ఏట, 1994 మే 13న షెర్పాగా తొలిసారి ఎవరెస్టును అధిరోహించాడు. అలవాటైన వృత్తిలో ప్రతిసారీ కొత్తవాళ్లకు మార్గదర్శిగా కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. భూగోళం మీద ఎనిమిది వేల మీటర్ల కంటే ఎత్తయిన ఎక్కువ శిఖరాలను అధిరోహించిన రికార్డు కూడా కామి రీతా పేరు మీదే ఉంది.
రీతా ఎవరెస్టు శిఖరంతోపాటు ప్రపంచంలో రెండో ఎత్తయిన గాడ్విన్‌-ఆస్టిన్‌ (ఏ2) పర్వతాన్ని, అలాగే మౌంట్‌ లోత్సే, మౌంట్‌ మాన్సలూ, చో ఆయు పర్వతాలనూ అధిరోహించాడు. తాజాగా రికార్డు నెలకొల్పిన 26వ అధిరోహణాన్ని.. 1953లో సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ, టెన్సింగ్‌ నార్కే తొలిసారి వెళ్లిన మార్గంలోనే కామి బృందం కూడా పయనించింది.
'షెర్పా' అసలైన అర్థం ఇదే..!
షెర్పా అంటే 'పర్వత మార్గదర్శి' అని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఆ పదానికి అసలైన అర్థం 'తూర్పువాసులు' అని. ఎవరెస్టు నీడలోని ఖుంబు లోయలో వేల ఏళ్లుగా జీవిస్తోన్న తెగ వారిది. సంచార పశువుల కాపరులుగా షెర్పాల జీవితాలు కొనసాగించేవారు... అయితే 19వ శతాబ్దం ఆరంభంలో ఎవరెస్టు సాహసయాత్రలు మొదలైనప్పటి నుంచి వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. పర్వత జీవన సంప్రదాయంతోపాటు ఎక్కువ ఎత్తులో జీవించడానికి అనువుగా వీరిలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి మిగతా వారికంటే భిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తల పరిశీలనలోనూ వెల్లడైంది. ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చే పర్వతారోహకులకు అన్నీ తామై వీరు వ్యవహరిస్తున్నారు.
పాశ్చాత్యులు రికార్డు చేసిన చరిత్ర ప్రకారం 1953లో న్యూజిలాండ్‌కు చెందిన సాహస పర్వతారోహకుడు ఎడ్మండ్‌ హిల్లరీ.. నేపాల్‌కు చెందిన టెన్సింగ్‌ నార్కే అనే షెర్పా సాయంతో మొట్టమొదటిసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. బహుశా ఎడ్మండ్‌ హిల్లరీ, టెన్సింగ్‌ నార్కే కంటే తరతరాల ముందు కొన్ని వందలమంది షెర్పా సాహసికులు ఎవరెస్టు పైకి దారి కనిపెట్టే పనిలో బలైపోయుండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం.
వేసవి మూడు నెలలే అనుమతి..
వేసవిలో మూడు నెలలు మాత్రమే ఎవరెస్టు యాత్రకు అనుమతి ఉంటుంది. మేలోనే యాత్రలు పూర్తిచేస్తారు. కాగా నేపాల్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఎవరెస్టును అధిరోహించేందుకు 316 అనుమతులే జారీ చేసింది. కాగా గతేడాది 408 పర్మిట్లు ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్యం కోసం పర్వతారోహకులపై ఎక్కువగా ఆధారపడిన హిమాలయ దేశం నేపాల్‌. దీంతో పర్యాటకుల రద్దీ ఎక్కువై ప్రమాదాలు, మరణాలకు కారణమవుతున్నాయనే విమర్శలూ ఉన్నాయి. దీంతో 2019 నుంచి ఎవరెస్టు పరిసర ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని, 8,848.86 మీటర్ల ఎత్తయిన ఎవరెస్టును ఎక్కడానికి నేపాల్‌ పర్యాటక శాఖ అనుమతులను కుదిస్తూ వస్తుంది.
ప్రమాదకరమైన సాహసయాత్ర..
ఎవరెస్టు అధిరోహణమే కాదు, శిఖరాన్ని చేరిన తర్వాత కిందకి దిగే అవరోహణ ప్రక్రియ కూడా అత్యంత ప్రమాదకరమైన సాహసయాత్రగానే భావిస్తారు. యాత్రికుల్ని ధైర్యంగా ఎవరెస్టుపైకి తీసుకెళ్లి, తిరిగి క్షేమంగా తీసుకురావడం షెర్పాలు నిర్వహించే ప్రధానమైన పని. ఆ పనిలో ఆరితేరిన వ్యక్తే కామి రీతా. కాగా హిమాలయన్‌ డేటాబేస్‌ ప్రకారం 1953 నుంచి ఇప్పటి (2022, మే) వరకూ మొత్తం 10,657 మంది ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. అయితే ఒకటి కంటే ఎక్కువసార్లే పైకి వెళ్లొచ్చిన వారు వీరిలో చాలా మంది ఉన్నారు. కాగా ఎవరెస్టు సాహయాత్రలో ఇప్పటివరకూ 311 మంది అధికారికంగా ప్రాణాలు కోల్పోయారు.