Jul 29,2021 08:57

దంత సమస్యలకు ఓ పరిష్కారం చూపించినందుకు ఇండో అమెరికన్‌ శాస్త్రవేత్త సుమితా మిత్రాను ప్రతిష్ఠాత్మక 'యూరోపియన్‌ ఇన్వెంటర్‌' అవార్డు వరించింది. దంతాలకు ఫిల్లింగ్‌ చేసేటప్పుడు వాటి రంగుకు సరి పోయేలా, అతి తేలికైన, బలమైన పదార్థాన్ని సుమితా ఆవిష్కరిచారు. దీన్ని నానోటెక్‌ ఫిల్లింగ్‌ అంటారు. దంతవైద్యంలో నానోటెక్నాలజీ వినియోగం దిశగా పరిశోధనలు చేపట్టడంతో 'నాన్‌ యూరోపియన్‌ కంట్రీ' విభాగంలో ఆమెకు ఈ గౌరవం దక్కింది. అమెరికాలోని ఓ పరిశోధనా సంస్థలో నోటి సంరక్షణా విభాగంలో కెమిస్టుగా పనిచేస్తున్న సుమితా... అక్కడ పని చేస్తూనే నానోటెక్‌ ఫిల్లింగ్‌పై సుదీర్ఘకాలం పరిశోధనలు చేశారు. పదవీ విరమణ అనంతరం 2010లో సొంతంగా 'మిత్రా కెమికల్‌ కన్సల్టింగ్‌' మొదలుపెట్టారు. దీని ద్వారా కెమికల్‌ సైన్సెస్‌లో టెక్నాలజీ, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌పై కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను అందించే వారు. దంతవైద్యంలో వినియోగించే పదార్థాలు, నానోటెక్నాలజీ వంటి ఆధునిక విధానాల్లోనూ సేవలందించారు. పాలిమర్‌ కెమిస్ట్రీలో తన అనుభవానికి పలు పరిశోధనలను జోడించారు.
నానో క్లస్టర్స్‌ అనే పదార్థాన్ని అభివఅద్ధి చేశారు. నానోపార్టికల్స్‌ నుంచి తయారైన ఈ పదార్థం దంతాల ఫిల్లింగ్‌కు అనువుగా ఉండటమే కాకుండా ఇప్పటి వరకు వినియోగిస్తున్న పదార్థాల కన్నా ఇది తేలికైనది, నాణ్యమైనదీ కావడం విశేషం. దంతాల్లో కావిటీని పూడ్చటానికి ఉపయోగించినప్పుడు వాటి రంగుకు సరిపడేలా మ్యాచ్‌ చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ఫిల్లింగ్‌ చేసినట్లుగా కనిపించకుండా, సహజసిద్ధమైన దంతాల్లా కనిపించేలా చేసే ఈ నానోక్లస్టర్స్‌ వైద్యులు, దంత రోగులను ఆకట్టుకుంది. ప్రజలకు ఉపయోగపడే అంశంలో గొప్ప పరిశోధనలు చేసే వారికి ఏటా యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ 'యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డు' ఇస్తుంది. ఈ ఏడాది పురస్కారానికి సుమితా మిత్రా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ నానో టెక్నాలజీ విధానం ఓ కొత్త ప్రయోగానికి ఊతమిచ్చిందని, తాను కనిపెట్టిన ఈ పదార్థాన్ని పాడైన దంతాలను ఫిల్‌ చేయడానికి మాత్రమే కాకుండా, దంతాలకు పాలిష్‌, ముందు వరుసలో ఉండే దంత సమస్యలకు వినియోగించొచ్చునని తెలిపారు. దీని వల్ల ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా నవ్వుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. దీర్ఘకాల దంత సమస్యలకూ ఇది పరిష్కారమవుతుందని, ఈ అవార్డు తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. గొప్ప పరిశోధకురాలిగా గుర్తింపు పొందిన సుమితా మిత్రా 2018లో ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ నుంచి 'హీరోస్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ' అవార్డును దక్కించుకున్నారు. అంతేకాదు, 'ఐఏడీఆర్‌ పేటన్‌ స్కిన్నర్‌'తోపాటు మరెన్నో పురస్కారాలనూ అందుకున్నారు.