ప్రజాశక్తి - వినుకొండ : తనపై వ్యాజ్యం వేసి నష్టపరిచిన వారిపై పరునష్టదావా వేసి పరిహారం కట్టిస్తానని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఆయన వద్ద 175 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, 53 కోట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రుణం పొందారనే వార్తలపై ఆయన స్పందిస్తూ స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. తన వద్ద ఒక్క సెంటు భూమి కూడా ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిరూపించినా దాన్ని వదిలేస్తానని, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో తనకు తన కుటుంబ సభ్యులకు ఖాతా కూడా లేదని అన్నారు. 2016 టిడిపి హయా ంలో తాను మూల్పురి ఆగ్రోటెక్ వద్ద నుండి భూమిని కొన్నానని, దానిలో ఒక సెంటు కూడా ప్రభుత్వ భూమి లేదన్నారు. ప్రభుత్వ భూములను ఓవర్సీస్ బ్యాంకులో పెట్టి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రుణం పొందాడని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ప్రజావ్యాజ్యం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని, అమయకుతో పిల్ వేయించకుండా దమ్ముంటే వారే వేయాలని అన్నారు. వినుకొండలో స్టేడియం, షాపింగ్ కాంప్లెక్స్, ఆస్పత్రి, రైతు బజారు ఇలా అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు కోర్టులో కేసులు వేయించి అడ్డుకుంటున్నారని, తాను త్వరలో నిర్మించే గుడి, మైనారిటీ కాలేజీ, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లనూ అడ్డుకుంటారని జీవీ ఆంజనేయులుపై విమర్శలు గుప్పించారు.










