Jul 03,2023 00:50

వార్డులను పరిశీలిస్తున్న డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌) సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరీంచిన గంటల వ్యవధిలోనే చికిత్సలు, సదుపాయాలపై డాక్టర్‌ వై.కిరణ్‌ కుమార్‌ దృష్టిసారించారు. మెడిసిన్‌ విభాగానికి 50 అదనపు పడకలు కేటాయించారు. ఆదివారం మెడికల్‌ వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన దాదాపు మూడు గంటలపాటు సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఆసుపత్రిలోని 102 మెడిసిన్‌ వార్డును మొదటగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ముక్కుపై వేలేసుకున్నారు. 102 వార్డుల్లో బాత్‌ రూములు బ్లాక్‌ ఉండటాన్ని గమనించారు. బాత్‌ రూముల్లో తలుపులు విరిగిపోయి ఉండటాన్ని పరిశీలించారు. పరిశుభ్రత లేక పోవడం, దుర్వాసన రావడాన్ని గుర్తించారు. వాటర్‌ పైప్‌లైన్‌ల్లో నుంచి నీరు వృథాగా పోవడాన్ని గమనించారు. బాత్‌రూమ్‌లకు విరిగిపోయిన తలుపులకు తక్షణమే మరమ్మతులు చేయాలని, బ్లాక్‌ అయినా లెట్రిన్‌లను సరి చేయాలని శానిటేషన్‌ సిబ్బందికి ఆదేశించారు. దాదాపు 10-15 మంది రోగులు మంచాలు లేక ముడు నాలుగు రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారని ఆయన గమనించారు. రోగులను స్ట్రెచర్‌పై ఉంచి వైద్య సేవలను అందించడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ వార్డుతో పాటు మిగతా జనరల్‌ మెడిసిన్‌ వార్డులను కూడా మంచాల కొరత, స్ట్రెచర్‌పై వైద్యం చేస్తున్న విధానాన్ని గుర్తించారు. వెంటనే మంచాలు ఇవ్వాలని ఆదేశించారు. మూడో అంతస్తులో ఉన్న 330 మెడికల్‌ వార్డులో పడకల కొరత ను గుర్తించి నివారణ చర్యలను చేపట్టారు. రెండు వార్డుల్లో ఖాళీగా ఉన్న ప్రదేశంలో పది పడకలను ఏర్పాటు చేశారు. అదే క్రమంలో 'బి' క్లాసులో ఉన్న 20 గదులలో గదికి రెండు చొప్పున పడకలను ఏర్పాటు చేసి జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విభాగానికి మొత్తం 50 పడకలను అందుబాటులో తీసుకువచ్చారు. పలువిభాగాల్లో దుర్గంద భరితంగా ఉన్న బాత్‌ రూమ్‌ల పరిసరాలను గుర్తించి పారిశుధ్య సిబ్బంది పై అసంతప్తి వ్యక్తం చేశారు. రోగి సహాయకులను కట్టడి చేసి ఐసియు బాత్‌ రూమ్‌ లోపలకు వెళ్లకుండా నిషేధిత బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని, నర్సింగ్‌ సిబ్బంది కౌంటర్స్‌ ఐసియు లోపల ఉండేలా మార్చాలని చెప్పారు. తక్షణమే అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎంఒ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌ను ఆదేశించారు.