Oct 02,2023 00:01

రెడ్‌క్రాస్‌ సభ్యులతో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి - అమలాపురం
ప్రథమ చికిత్సపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ హి మాన్షు శుక్లా అన్నారు. ఆదివారం జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ప్రాథమిక వైద్య చికిత్స విధానాలపై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. 34 మంది అభ్యర్థుల ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. ప్రాథమిక వైద్యంతో చాలా వరకూ ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. అభ్యర్థులు అన్ని విషయాల్లో అవగాహన కల్పించుకోవాలన్నారు. గోదావరి వరదల సమయంలో లంక గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ముంపు బాధితుల ఆరోగ్య పరిరక్షణ చర్యలు పక్కాగా చేపట్టామన్నారు. నలుగురు పాముకాటుకు గురైన సందర్భంలో యాంటీ స్నేక్‌ వీనం ఇంజక్షన్‌ ఇచ్చి అర్ధగంటలోపు నిపుణులైన వైద్యుల వద్దకు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ప్రాథమిక వైద్య చికిత్స విధానాల పట్ల స్పష్టమైన అవగాహనను పెంపొందించుకోవాలన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆయన ధ్రువ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబు, జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షులు కె.సత్యనారాయణ కార్యదర్శి పిఎస్‌.శర్మ మాస్టర్‌ ట్రైనీలు పాల్గొ న్నారు.