Aug 18,2023 18:50

గ్రూప్‌-1 పరీక్షల్లో తొలి ర్యాంకు
మనపై మనకు నమ్మకమే ఆయుధం
గణేశ్న భాను శ్రీలక్ష్మీఅన్నపూర్ణ ప్రత్యూష
ప్రజాశక్తి - కాళ్ల

           పటిష్టమైన పునాది.. మనపై మనకు నమ్మకం ఉంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సులువుగా సాధించవచ్చని గణేశ్న భాను శ్రీలక్ష్మీఅన్నపూర్ణ ప్రత్యూష అన్నారు. మండలంలోని సీసలి గ్రామానికి చెందిన ప్రత్యూష ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపారు. 22 ఏళ్ల వయస్సులో గ్రూప్‌-1 పరీక్షలో తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి గణేశ్న వెంకట రామాంజనేయులు భీమవరం మండలం డిఇఒ కార్యాలయంలో ఎపిఒగా పని చేస్తున్నారు. తల్లి ఉష గృహిణి. వీరికి ప్రత్యూష ఒక్కరే సంతానం. ఆమె ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఢిల్లీలో పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. ప్రస్తుతం సివిల్స్‌ మె యిన్స్‌కు సిద్ధమ వుతున్నారు. ఎ పిపిఎస్‌సి గ్రూప్‌-1లో తొలి ర్యాంకు రావడంతో ఆమె తల్లిదండ్రులు రామాంజ నేయులు, ఉష, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
తండ్రి ప్రోత్సాహంతో...
           ''నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది నా తండ్రి కల. ఇంజినీరింగ్‌ వంటి కోర్సులకు బదులుగా ఢిల్లీకి పంపి బిఎలో చేర్పించారు. డిగ్రీ పూర్తవ్వగానే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా నా తండ్రి ప్రోత్సహించారు. ఢిల్లీలో నాతో పాటు మా అమ్మ ఉంటుంది. తండ్రి ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించాను. ఏడాది పాటు ఢిల్లీలో ఉంటూ ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 పరీక్షలకు సిద్ధమయ్యాను. నా తండ్రి సూచనతోనే ఈ పరీక్ష రాశాను. ఫిలిమ్స్‌ పరీక్ష యుపిఎస్‌సి స్థాయిలో ఇవ్వడంతో సులువైంది. మెయిన్స్‌ మాత్రం ప్రత్యేకంగా సిద్ధమయ్యా. మెయిన్స్‌ ఫలి తాలు తర్వాత నమూనా ముఖాముఖికి హాజరై తర్ఫీదు తీసుకున్నారు. ముఖాముఖిలో అభ్యర్థుల అభిప్రాయాల ఆధారంగానే ఎక్కువ ప్రశ్నలు అడిగారు'' అని ప్రత్యూష తెలిపారు.
సివిల్స్‌ నా లక్ష్యం
గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష, సీసలి

             లక్ష్య సాధనకు పటిష్టమైన పునాదే ఎంతో కీలకం. ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 మా నాన్న కల. భవిష్యత్తులో సివిల్స్‌కు ప్రయత్నిస్తా. ఇప్పటికే సివిల్స్‌ ఫిలిమ్స్‌ రాశాను. సెప్టెంబర్‌లో మెయిన్స్‌ రాయాల్సి ఉంది.