ప్రజాశక్తి-విజయవాడ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరిం చుకుని ప్రార్థనా మందిరాలు, ముస్లీమ్ నివాసిత ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లీమ్, మైనార్టీలకు కల్పించవలసిన ప్రత్యేక సదుపాయాల పై శనివారం నగరంలోని కలెక్టరేట్ పింగళివెంకయ్య స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ముస్ల్లీమ్ మతపెద్దలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపధ్యంలో ప్రార్థన మందిరాలైన మసీదులు, దర్గాల వద్ద అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, సబ్‌కలెక్టర్ అదితి సింగ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, నందిగామ, తిరువూరు ఆర్‌డివోలు ఏ రవీంద్రరావు, వైవి ప్రసన్నలక్ష్మి, జిల్లా మైనారిటి వెల్ఫేర్ ఆఫీసర్ సంఝన్నీసా బేగం, డిఎస్‌వో పి.కోమలి పద్మ, జిల్లా వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ ఖాజామస్తాన్ ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ డివి రమణ, ముస్లీమ్ మత పెద్దలు పాల్గొన్నారు.










