Oct 07,2023 22:12

కలెక్టర్‌ ఎం.గౌతమి

        అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ రేషియో, జిఈఆర్‌) నమోదుకు వందశాతం కార్యాచరణ ప్రణాళిక చేపడతామని కలెక్టర్‌ ఎం.గౌతమి తెలియజేశారు. విజయవాడలోని సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కలెక్టర్‌లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా||కెఎస్‌.జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫిరెన్స్‌ను శనివారం నిర్వహించారు. అనంతపురం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌తో వివిధ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 5 నుంచి 18 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరినీ పాఠశాలలో చేర్పించేలా ప్రత్యేక దష్టి సారించామన్నారు. జిఈఆర్‌ నమోదు వంద శాతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. బాలికల డ్రాపౌట్‌లను తగ్గించి వారిని మళ్లీ పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక దష్టి పెట్టామన్నారు. బడి మానేసిన పిల్లలను పాఠశాలలో చేర్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంత సంకల్పం కింద ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద పరీక్షలకు 100 రోజుల ముందు నుంచి ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు ముఖ్యమైన పాఠాలపై అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు విస్తత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ త్వరగా పరిష్కరించేలా దష్టి సారిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఒ ప్రశాంత్‌ కుమార్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, పీఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఇషాన్‌ బాషా, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సురేంద్ర, ఐసిడిఎస్‌ పీడీ శ్రీదేవి, డిఎంహెచ్‌ఒ డా||ఈబి.దేవి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, డిఇఒ నాగరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.