Nov 06,2023 21:21

వీడియోకాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్‌, జెసి

కడప : 5వ విడత నిర్వహించబోయే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రధాన్యతతో నిర్వహించాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం తాడేపల్లి నుండి 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమంపై ముఖ్యమంత్రి నిర్వహించిన విసికి కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హల్‌ నుంచి కలెక్టర్‌, జెసి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ హాజరయ్యారు. సీఎం విసి ముగిసిన అనంతరం. సిఎం అందించిన మార్గదర్శకాల మేరకు సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్‌ పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రధాన్యతతో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్షను ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో అత్యంత ప్రధాన్యతతో క్షేత్ర స్థాయిలో అమలవుతుండడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ప్రస్తుతం 5వ దశలో జరుగుతున్న 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం జిల్లాలో చివరి దశలో ఉందని, ఇప్పటికే హెల్త్‌ క్యాంపులు పూర్తి చేశారని తెలిపారు. ఆరోగ్య సమస్యలు గుర్తించిన వారిక రెఫరల్‌ ఆసుపత్రుల్లో అందించే చర్యలను వేగవంతం చేయాలన్నారు. వచ్చే ఏడాది జనవరి నుండి క్యాంపులు తిరిగి నిర్వహిస్తారన్నారు. ప్రతి కుటుంబాన్ని ఆరోగ్య సురక్ష ద్వారా జల్లెడ పట్టి అర్హులైన వారందరికీ వైద్య పరీక్షలు చేయించి వారి ఆరోగ్య రిపోర్ధులను నమోదు చేయాలన్నారు. జనవరి నుంచి నూతన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తారన్నారు. అందుకు సంబంధించి వైద్యఆరోగ్య శాఖ అధికారులు, సంబందిత డేటాను అప్‌ డేట్‌ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్‌పి సిఇఒ సుధాకర్‌ రెడ్డి, సిపిఒ వెంకట్రావు, అదనపు డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఉమామహేశ్వర్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ బాలాంజనేయులు, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.