Nov 04,2023 23:37

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ సిటీ నియోజకవర్గ ఇఆర్‌ఒ, నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు శనివారం నగరంలోని పలు పోలింగ్‌ స్టేషన్లను సందర్శించారు. శ్రీనగర్‌, గొడారిగుంట ప్రాంతాల్లో ఓటరు ప్రత్యేక నమోదు కేంద్రాలకు వెళ్లి అక్కడ ప్రక్రియను పరిశీలించారు. కొత్త ఓట్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి ఫారం-6, 7, 8 ద్వారా వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అక్కడ ఉన్న బిఎల్‌ఒలు, ఇతర అధికారులను ఆదేశించారు. ఆదివారం కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయని ఇఆర్‌ఒ నాగనరసింహారావు చెప్పారు. ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నదే అభిమతమన్నారు. ఆయన వెంట ఎఇఆర్‌ఒ, ఎలక్షన్‌ డిప్యూటీ తహసీల్దార్‌ డివి.మురళీకృష్ణ ఉన్నారు.