Jul 03,2023 21:40

ప్రత్యేక నవజాత శిశువిభాగం ఏర్పాటుకు కసరత్తు

కడప ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ప్రత్యేక నవజాత శిశువిభాగం ఏర్పాటుకు కసరత్తు ఊపందుకుంది. జిజిహెచ్‌ అధికార యంత్రాంగం ఆగస్టు నెలాఖరు నాటికి ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. జిల్లా సర్వజనాస్పత్రి వెనుకభాగంలోని అదనపు భవనాలను ఎంపిక చేసింది. వైద్య అవసరాలు, పరికరాలకు అవసరమైన వసతుల కల్పనకు సంబంధించి రూ.60 లక్షలతో కూడిన ప్రతిపాదనలు అందజేసింది. జిజిహెచ్‌లో గర్భిణులకు, నవజాత శిశుసంరక్షణ మెరుగైన చికిత్స అందిస్తున్న నేపథ్యంలో నిరుపేదలు, పేదలు, దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి ప్రజానీకం జిజిహెచ్‌ను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. జిజిహెచ్‌లో కాన్పుల విభాగం మొదలుకుని నవజాత శిశువిభాగానికి రోజురోజుకూ ఒత్తిడి పెరిగిపోతోంది. కాన్పుల విభాగంలో బెడ్‌కు ఇద్దరు, ముగ్గురు చొప్పున వైద్య చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి అదనపు విభాగమైన నవజాత శిశువిభాగంలో 20 బెడ్స్‌ నిండిపోతోంది. మరో 20 అదనపు బెడ్‌లకు అనుమతి లభించింది. మొత్తం 40 బెడ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక నవజాత శిశువిభాగంలో కీలకమైన వైద్యపరికరాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇందులో ప్రధానంగా ఫొటోథెరఫీ, వార్మర్‌, ఇంక్యుబేటర్‌, సి-క్యాప్‌ యూనిట్స్‌, సెంట్రల్‌ ఆక్సిజన్‌ పరికరాలు, ఆంటల్‌ సెక్షన్‌ వంటి పరి కరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి రూ.34 లక్షలు వెచ్చించే అవకాశాలు ఉన్నట్లు తెలు స్తోంది. ఏదేమైనా జిజిహెచ్‌లో ప్రత్యేక ఎసెన్సియా ఏర్పాటుకు అనుమతి లభించిన నేపత్యంలో నెలలు నిండక ముందే పుట్టిన నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అం దుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.