'ఉమ్మడి పశ్చిమ'లో 2014 పునరావృతం
బిసిలకు ప్రత్యేక నిధులేవీ
పోలవరం ప్రాజెక్టును చూడాలని చంద్రబాబు పట్టు
అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే బాబు బైఠాయింపు
ఏలూరు జిల్లాలో ముగిసిన చంద్రబాబు పర్యటన
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, కొయ్యలగూడెం, పోలవరం
పోలవరం మండలాలన్నింటినీ కలిపి ప్రత్యేక జిల్లాగా చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 స్థానాలు టిడిపి, మిత్రపక్షం గెలుచుకుందని, ఇప్పుడు మరోసారి అదే పునరావృతం కానుందని, వైసిపికి ఒక్కసీటు కూడా రాదని ఆయన తెలిపారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో గురువారం రెండోరోజు పర్యటన కొయ్యలగూడెం, పోలవరం మండలాల మీదుగా సాగింది. ఉదయం 11.30 గంటలకు నరసన్నపాలెంలోని దండమూడి రామలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో బిసి నాయకులతో ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షత వహించారు. ముందుగా తూర్పుకాపు, గౌడ, శెట్టిబలిజ, యాదవ, కొప్పువెలమ, వడ్డి, కుమ్మరి, రజక, ఉప్పర, విశ్వబ్రాహ్మణ సామాజిక తరగతులకు చెందిన నాయకులు మాట్లాడారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని బిసిలకు కేటా యించాలని, ఏలూరు జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు బిసిలకు కేటాయించాలని కోరారు. ఆదరణ పథకం కొనసాగించాలని, కల్లుగీత కార్మికులకు చెట్లు నాటుకునేందుకు భూమి కేటాయించాలని పలు సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టిడిపికి బిసిలు వెన్నుముకని అన్నారు. పశ్చిమలో అన్ని స్థానాలనూ మరోసారి గెలుచుకుంటామన్నారు. బిసిలు ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా ఎదగలన్నారు. 54 సాధికారిక కమిటీలను ఏర్పాటు చేసి బిసిల సమస్యలను తెలుసుకుని, ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. అందరికీ ఇచ్చే కార్యక్రమాలు కాకుండా బిసిలకు ప్రత్యేక నిధులు కేటాయించకుండా చేశారన్నారు. కీలకమైన అన్ని పదవులనూ రెడ్లకు కట్టబెట్టారన్నారు. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 20 శాతం కేటాయింపులు చేస్తామన్నారు. వైసిపి ప్రభుత్వం 39 మంది బిసి నేతలను పొట్టనబెట్టుకుందన్నారు. 650 మందిపై కేసులు పెట్టారన్నారు. వైసిపి ఆఖరి గడువు దగ్గర పడిందని హెచ్చరించారు.
పోలవరంలో ఉద్రిక్తత
బిసిలతో సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు తన పర్యటనను సాగించారు. బయ్యన్నగూడెంలో చంద్రబాబుకు నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి కొయ్యలగూడెం చేరుకున్న చంద్రబాబు సెంటర్లో మాట్లాడారు. వైసిపిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం నిర్వాసితులకు పది లక్షల ప్యాకేజీ, భూములకు రూ.ఐదు లక్షలు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. మాటలకు.. చేతలకు పొంతన లేదన్నారు. ఇంతలో మద్యం తాగిన వ్యక్తి అక్కడే పడిపోగా, ఇదే నిదర్శనమని, జగన్ ఇలాంటి మద్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు అతన్ని తీసుకు వెళ్లి మంచినీళ్లు పట్టించాలన్నారు. 'జగన్ రావడం మా అదృష్టం' అంటూ కొయ్యలగూడెంలో కొంతమంది వైసిపి కార్యకర్తలు ప్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు. అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామన్నారు. అనంతరం దిప్పకాయలపాడులో చంద్రబాబు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు ముందుకు సాగారు. కన్నాపురంలో పెద్దఎత్తున జనం చేరడంతో చంద్రబాబు మాట్లాడుతూ గోరంత ఇచ్చి కొండంత దోచేస్తు న్నారన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం అంతా ఆలోచించాలన్నారు. అక్కడ నుంచి ఎల్‌ఎన్‌డిపేట మీదుగా చంద్రబాబు పోలవరం చేరుకు న్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తయ్యారు. ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డుకు బారీకేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు వాహనాలను సైతం అడ్డంగా నిలిపారు. పోలవరం చేరుకున్న చంద్రబాబు ప్రాజెక్టు వద్దకు వెళ్తానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మావోయిస్టుల ప్రమాదం ఉందని, వారోత్సవాలు జరుగుతున్నాయని, రాత్రి అయ్యిందని పోలీసులు తెలిపారు. తనను ఎప్పుడు వెళ్లమంటారని పోలీసులను చంద్రబాబు నిలదీశారు. అరగంటపాటు పోలవరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం జీపుపైకి చేరుకుని సభలో ప్రసంగించారు. పోలవరంను చిదిమేశారని, తాను కట్టిన ప్రాజెక్టు వద్దకు తనను వెళ్లనివ్వకపోవడం దారుణమన్నారు. గిరిజనులకు, రైతులకు తీరని అన్యా యం చేశారన్నారు. అనంతరం కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటన సాగించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన సాగనుంది. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున టిడిపి నాయకులు పాల్గొన్నారు.










