Jan 25,2023 00:13

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నేతలు

ప్రజాశక్తి-అనకాపల్లి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు అనంతపురం నుంచి ఇచ్ఛాపురం వరకు సమర యాత్ర నిర్వహించనున్నట్టు విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. స్థానిక కోడిగంటి గోవిందరావు భవనంలో మంగళవారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు వంటి వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. వీటిని ప్రశ్నించాల్సిన అధికార వైసిపి, విపక్ష టీడీపీ పార్టీలు బిజెపికి తోకగా మారిపోయాయని విమర్శించారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక చెడు తోవ పట్టే ప్రమాదం ఉందన్నారు. ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు వైసిపి టిడిపి జనసేనకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఉద్యమంలో కలిసి రావాలన్నారు. అనంతరం సమర యాత్ర పోస్టరును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగ రమణ, నాయకులు తరుణ్‌, మౌనిక అనిత, డివైఎఫ్‌ఐ నాయకులు నాయుడు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర కుమార్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కన్నబాబు, వి రాజు, హరీష్‌, పిడిఎస్‌ఓ రాష్ట్ర నాయకులు భాస్కర్‌, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ వై ఎన్‌ భద్రం, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు చిన్ని యాదవ్‌, మాణిక్యాలరావు, హరినాథ్‌ బాబు, అప్పారావు పాల్గొన్నారు.