ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్ విషయంలో మోసగించిన బిజెపి ప్రభుత్వంపై పోరాడాలని అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో శుక్రవారం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం నాయకులు ఎ.బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 8 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బిజెపి ఇంతవరకు రాష్ట్రానికి న్యాయం చేయకపోగా, మరోసారి అధికారం ఇస్తే న్యాయం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమలు జరుగుతుందన్నారు. పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన నాయకులు నేడు కనీసం మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతాలకు ఇస్తామన్న నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంపై పోరాడకుండా విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. బిజెపి అడుగులకు మడుగులోత్తుతున్న ఈ పార్టీలు ప్రజా కోర్టులో దోషులుగా నిలబడక తప్పదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తామని నిస్సిగ్గుగా బిజెపి చెబుతుంటే, ఆ పార్టీని వెనకేసుకురావడం దారుణమన్నారు. ఈ సమావేశంలో ఎన్‌వి భద్రం, మల్ల మాధవరావు (ఏఐటీయూసీ), ఆర్.శంకర్రావు, ఈశ్వరరావు, చలపతి (సిఐటియు) గంట శ్రీరామ్ (గొర్రెలు మేకలు పెంపకం దారుల సంఘం), పి.శ్రీనివాసరావు (పౌర సంక్షేమ సంఘం), తేలయ్య బాబు (కౌలు రైతు సంఘం), బుగిడి నూక అప్పారావు (వికలాంగుల హక్కుల జాతీయ వేదిక), తాకాసి వెంకటేశ్వరరావు (మాజీ కౌన్సిలర్) మాట్లాడారు.










