- సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నర్సింగరావు
- ఎన్‌టిఆర్ జిల్లా మహాసభ సందర్భంగా భారీ ర్యాలీ
ప్రజాశక్తి-విజయవాడ: ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దాని సాధన కోసం రాజకీయాలకతీతంగా ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు. సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా 11వ మహాసభ సందర్భంగా వన్‌టౌన్ పంజాసెంటర్ నుంచి జెండా చెట్టు వరకు ర్యాలీ గురువారం నిర్వహించారు. అనంతరం అక్కడ బహిరంగ సభ జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో నర్సింగరావు మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా చట్టం చేయబడిన ప్రత్యేక హోదాను గత ఏడేళ్ల నుంచి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేయడంలేదన్నారు. రాబోయేది పోరాటాల సంవత్సరమన్నారు. జనవరి 2, 3, 4 తేదీల్లో సిఐటియు రాష్ట్ర మహాసభలు భీమవరంలో జరుగుతున్నాయని, ఆ మహాసభలో రాబోయే కాలంలో నిర్వహించబోయే దశలవారీ పోరాటాలపై దిశనిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో కార్మికులు, కష్టజీవులు, ఆయా తరగతుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాలు, పతనావస్థలో ఉన్న ఆర్థిక వ్యవస్థే కారణమన్నారు. కార్పొరేట్ల అనుకూల విధానాలను అమలు చేస్తూ ధరల భారాన్ని ప్రజలపై మోపుతున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా ప్రయివేటు వారికి కట్టబెట్టడం, చివరకు రోడ్లు, మౌలిక వసతులు, సహజ సంపదలను లీజుకివ్వడం వంటి విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లు వల కార్మిక హక్కులకు రక్షణ లేకుండా పోతున్నాయని పేర్కొన్నారు. రైతాంగ ఉద్యమ స్పూర్తితో వాటి రద్దుకు పోరాడాలని కోరారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మీ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని శ్రామిక మహిళలు, స్కీమ్ వర్కర్లు కరోనా కాలంలో తమ ప్రాణాలనుసైతం పణంగా పెట్టి ఎంతో సేవలు అందించారని, అటువంటి వారికి సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వాలు తీసివేయడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. వీరికిచ్చిన హామీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని అన్నారు. రాష్ట్రంలో కనీస వేతనాలను సవరించి 15 ఏళ్లయిందని అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలనే రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా అమలు పరుస్తుందని విమర్శించారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి తగిన గుణపాఠం చెప్పాల్సి ఉందన్నారు. సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా ఉపాధ్యక్షులు డివి కృష్ణ మాట్లాడుతూ ఎన్‌టిఆర్ జిల్లాలోని ఆయా రంగాల్లో పనిచేస్తున్న కార్మికవర్గం అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి సాధన కోసం రాజీలేని పోరాటం చేయాల్సి ఉందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఈ మహాసభలో రాబోయే రెండేళ్ల పాటు జిల్లాలో నిర్వహించబోయే పోరాటాలను రూపొందించడం జరుగుతుందన్నారు. ముఠా కార్మికుల దగ్గర నుంచి ఆటో, ఆశా, ఇతర రంగాల్లోని ఉద్యోగ, కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై గడిచిన ఈ కాలంలో రాజీలేని పోరాటాలు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజరుకుమార్, జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎన్‌సిహెచ్ సుప్రజ, ఎ కమల, ఎంవి సుధాకర్, ఎం సీతారాములు, పి నరసింహారావు, ఇ విజరుప్రకాష్, బి సత్యబాబు, ఇవి నారాయణ, ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు.










