
ప్రజాశక్తి - వీరవాసరం
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల వద్ద ఏర్పాటు చేస్తున్న అంగనవాడీ పోషకాహార స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంగన్‌వాడీలు తయారు చేసిన రాగిజావ ఇక్కడకు వచ్చిన ప్రతి వారిచే తాగిస్తున్నారు. జావ తాగినవారు దాని తయారీ విధానాన్ని వారి నుంచి తెలుసుకుంటున్నారు. ఎంతో రుచిగా ఉన్న ఈ రాగి జావ పట్ల పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాగిజావా తాగారా అంటూ తాగకపోతే తాగుతావా అంటూ ఒకరినొకరు అడుగుతున్నారంటే దాన్ని ఎంత రుచిగా తయారు చేసి అందిస్తున్న అంగన్‌వాడీలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంగన్‌వాడీల కేంద్రాల ద్వారా అందిస్తున్న బాలామృతంతో వివిధ రకాల వంటలు ఎలా తయారు చేసుకోవచ్చు, వాటి రుచి ఎంత అమోఘంగా ఉంటుందో తెలియజేస్తూ స్టాల్స్‌లో వంటకాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. మంగళవారం మత్స్యపురిపాలెంలో అంగనవాడీ వర్కర్లు ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ స్టాల్‌ను మత్స్యపురిపాలెం, కమతాలపల్లి, దూసనపూడికి చెందిన అంగనవాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు వై.వెంకటలక్ష్మీ, సిహెచ్.ఎస్తేరురాణి, కె.భాగ్యలక్ష్మి, ఐ.వరలక్ష్మి తెలిపారు. ఈ స్టాల్‌ను సందర్శించిన సూపర్‌వైజర్లు డి.గీతా, వి.కనకమహాలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు.