అనంతపురం ప్రతినిధి : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపైనా పెద్దగా ఆసక్తి చూపుతున్న దాఖలాల్లేవు. 80 శాతం సబ్సిడీతో ప్రభుత్వం విత్తన పంపిణీ చేపడుతున్నా తీసుకోవడానికి రైతులు ముందుకు రావడం లేదు. ఇక ఖరీఫ్ సీజన్ సమయం కూడా ముగియడంతో ఈసారి పంటల సాగు ఖరీఫ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. జిల్లా సాధారణ సాగు 9.96 లక్షల ఎకరాలవుతే 7.04 లక్షల ఎకరాల్లోనే పంటల సాగయ్యాయి. 2.92 లక్షల ఎకరాలు ఇప్పటికీ బీడుగా ఉంది.
20 శాతం కూడా పోని ప్రత్యామ్నాయ విత్తనాలు
జిల్లాలో ఖరీఫ్ సీజన్ కీలక సమయమైన ఆగస్టు నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు సాధారణ పంటలను సాగు చేయలేకపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం సబ్సిడీతో ప్రత్యామ్నాయ విత్తనాలు ఉలవలు, పెసలు, అలసందలు, కొర్రలు పంపిణీ చేపట్టింది. రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే 80 శాతం సబ్సిడీతో వీటిని అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో 16 వేల క్వింటాళ్లను రైతు భరోసా కేంద్రాల్లో నిలువ చేశారు. 10,328 మంది రైతులు విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 3226 క్వింటాళ్లను తీసుకున్నారు. మొత్తం పంపిణీ చేపట్టిన దానిలో 20 శాతం కూడా విత్తనాన్ని రైతులు తీసుకోలేదు.
23 శాతం బీడే
అనంతపురం జిల్లాలో 9.96 లక్షల ఎకరాలు సాధారణ సాగయితే, 7.04 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ సాగులో 77 శాతం మాత్రమే అయింది. తక్కిన 23 శాతం బీడుగానే ఉంది. జొన్న, సజ్జ వంటి పంటల సాగు కొంత వరకు పెరిగినా పూర్తి స్థాయిలో సాగు విస్తీర్ణం పెరగలేదు. జొన్న సాధారణం కంటే కొద్దిగా అధికంగా సాగైంది. 17 వేల ఎకరాల్లో విత్తనం వేశారు. సజ్జ 3400 ఎకరాలకుగానూ 5614 ఎకరాల్లో అయింది. సాధారణం కంటే 168 శాతం సాగైంది. చిరుధాన్యలు 4091 ఎకరాల సాధారణ సాగయితే 4746 ఎకరాల్లో సాగైంది. సాధారణం కంటే కొద్దిగా పెరిగింది. ఇలా ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా ఆశించినంత పెరుగుదల లేదు.
ఇప్పటికీ వర్షాభావమే
అనంతపురం జిల్లాలో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. ఇప్పటి వరకు 366 మిల్లీమీటర్లు వర్షపాతం పడాల్సి ఉండగా 249 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. 32 శాతం లోటు వర్షపాతం నమోదయింది. 24 మండలాల్లో వర్షాభావం నెలకొనగా, శెట్టూరులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 321 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 127 మిల్లిమీటర్లు మాత్రమే పడింది. ఆరు మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదు అయ్యింది.










