
చి'వరి'కి ప్రత్యామ్నాయమే శరణ్యమని తేలిపోయింది. శుక్రవారం కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లలో నిర్వహించిన జిల్లా సాగునీటి, వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో ఖరీఫ్ కథ కంచికి చేరింది. పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోని తుంగభద్ర, రాష్ట్రంలోని శ్రీశైలం రిజర్వాయర్లకు వరదలు రాలేదని, సదరు జలాశ యాల్లో ఆశించిన మేర నీటి నిల్వలు పెరగకపోవడంతో ఆయకట్టుకు నీటిని విడుదల చేయడానికి అవకాశం లేకపోవడంతో సాగునీటిని విడుదల చేయడం లేదని సమీక్షా సమావేశాలు తేల్చాయి. ఇటు వంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని వర్షాభావం పరిస్థి తులను ఏకరువు పెట్టడానికే సమావేశం పరిమితం కావడం ఆందోళన కలిగిం చింది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మండలాల్లో కరువు తాండ వం చేస్తోంది. ఈ మేరకు పలు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ వర్షపాతం కలిగిన అన్నమయ్య, కడప జిల్లాల్లో కరువు మండలాల గురించి మాట మాత్రంగానైనా ప్రస్తావన చేయకపోడం విస్మయాన్ని కలిగించింది. వ్యవసాయ సలహాదారులు హాజరైన సమావేశాల్లో కరువు మండలాల గురించి ప్రస్తావన లేకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఒకవైపు ఎపి రైతు సంఘం జిల్లా లోని కరువు పీడిత మండలాల్లో పర్యటిస్తూ కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఇటువంటి కరువు పీడిత డిమాండ్లను కూడా పట్టించుకునే స్ఫృహలో లేకపోవడం ఆందోళన కరం. ఇటువంటి తీవ్ర కరువు పీడిత పరిస్థితుల్లో నిర్వహించిన సాగునీటి, వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో సలహా దారులుగా ఉన్న నాయకులకు కరువు మండలాలు గురించి పట్టకపోవడం గమనార్హం. జిల్లా వ్యవ సాయశాఖ, సిపిఓ వంటి అధికారులైన సమావేశాల దృష్టికి తేవాల్సి ఉంది. సలహాదారులు కరువు మండలాల విషయంపై చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొని ఉంటే బాగుండేది. జిల్లా రైతాంగానికి కూడా కొంత ఉపశమనం కలిగి ఉండేది. ఎటువంటి కనీస ప్రయత్నం చేయకుండా మొక్కుబడిగా సమీక్షా సమావేశాలను నిర్వహించడం దేనికనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. కేవలం ప్రత్యామ్నాయ పంటల సాగు పరిస్థితుల్ని గురించి ప్రస్తావించడా నికైతే ప్రకటన జారీ చేస్తే సరిపోయే దానికి జిల్లా సాగునీటి సలహా, వ్యవసాయశాఖ సలహా మండలి సమావేశాల పేరుతో జిల్లాలోని ఉన్నతాధికారులు, సలహాదారులు హడావుడిగా ఒకచోట సమావేశమై స్పష్టమైన నిర్ణయాల్ని తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగించింది.
-ప్రజాశక్తి - కడప ప్రతినిధి