
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : ప్రత్యామ్నాయం చూపించకుండా పేదల ఇల్లు తొలగించడం అన్యాయమని సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి అన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో ప్రాతూరులో ప్రధాన రహదారి వెంటున్న ఆరు ఇళ్లను తొలగించేందుకు ఎంటిఎంసి అధికారులు సోమవారం పూనుకున్నారు. ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను కట్ చేశారు. ఇది తెలిసిన వెంకటరెడ్డి, అక్కడికి చేరుకున్నారు. 30 ఏళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, ఉన్నట్టుండి ఇళ్లు ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్లాలని, అద్దెలు కూడా చెల్లించే స్థితిలో లేమని పేదలు వాపోయారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారి డి.రమేష్‌బాబు మాట్లాడుతూ ఇంటి స్థలం కోసం గ్రామ సచివాలయంలో అర్జీ పెట్టుకోవాలని సూచించారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇల్లు కోల్పోతున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించి, గృహనిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించాకే ఇప్పుడున్న ఇళ్లను తొలగించాలనేగాని ఉన్నఫలంగా తొలగించడం అన్యాయమని అన్నారు. ఇప్పుడు వీరు ఎక్కడికెళ్లగలని, పైగా ఇళ్ల స్థలాల పంపిణీ విషయం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు. పేదల ఇళ్లను తొలగించడం ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పాతూరు గ్రామ శాఖ కార్యదర్శి డి.రాజేంద్రబాబు, తెలుగు యువత నాయకులు సంకురు నాని పాల్గొన్నారు.