మంగళవారంనాడు శరద్ పవార్ నివాసంలో కొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశం కావడంతో రానున్న ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి కూటమి కడుతున్నారన్న కథనాలు కుప్పతెప్పలుగా వస్తున్నాయి. ఇది థర్డ్ ఫ్రంట్ సమావేశం కాదని, తన నేతత్వంలోని రాష్ట్ర మంచ్ సమావేశానికి పవార్ అధ్యక్షత వహించారని యశ్వంత్ సిన్హా వెల్లడించారు. ఇది రాజకీయ సమావేశం కాదని, భావ సారూప్యత గల వ్యక్తుల మధ్య ఇష్టాగోష్టి వంటిదని, కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, పెరుగుతున్న నిరుద్యోగం, రాజ్యాంగ సంస్థలపై పెరుగుతున్న దాడులు తదితర అంశాలపై చర్చించినట్లు నీలోత్పల్ బసు చెప్పారు. సమావేశానికి హాజరైన టిఎంసి, ఎస్‌పి, ఆప్, ఆర్‌ఎల్‌డి, నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్షాల నాయకులు జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుపై సాగుతున్న ఊహాగానాలను తోసిపుచ్చినా మీడియాలో మాత్రం చర్చ కొనసాగుతోంది. ఒక ప్రభుత్వాన్ని గద్దె దించడం లేదా ఎన్నికల్లో ఓడించడం అంత హడావుడిగా జరిగే పనులు కాదు. ఎమర్జెన్సీ రద్దు చేసిన వెంటనే 1977లో జనతా పార్టీ ఏర్పడి ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించింది కదా అని ఎవరైనా అనొచ్చు. కాని, అది కొద్ది కాలంలోనే ఏర్పడ్డది కాదని, కూటమి కట్టడం ద్వారా మాత్రమే కాంగ్రెస్‌ను ఓడించలేదన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. 1974లో జరిగిన దేశ వ్యాప్త రైల్వే సమ్మె, జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వాన సాగిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం, అలహాబాద్ హైకోర్టు తీర్పు అనంతరం ప్రజాస్వామ్యం కోరుతూ వెల్లువెత్తిన ప్రజాగ్రహం, ఎమర్జెన్సీ అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనలూ... ఇలా దీర్ఘ కాలం అనేక తరగతుల ప్రజానీకం సాగించిన వివిధ ఉద్యమాలు, ఆందోళనలూ.... వీటన్నిటి నేపథ్యంలోనే జనతా పార్టీ ఏర్పాటు, కేంద్రంలో తొలిసారి కాంగ్రెస్ ఓటమి సాధ్యమయ్యాయన్నది చారిత్రక వాస్తవం.
మోడీ సర్కారు గడచిన ఏడేళ్ల పాలనలో నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు ద్వారా దేశ విదేశీ కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రజలపై విపరీత భారాలు వేస్తోంది. ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని మరింత దివాళా తీయించేలా మూడు నల్ల చట్టాలను చేసింది. వాటిని రద్దు చేయాలంటూ అన్నదాతలు గత ఆరు నెలలకు పైగా దేశమంతటా పట్టుదలగా ఆందోళన సాగిస్తున్నారు. వ్యవసాయ కార్మికులతో సహా రైతాంగంలోని వివిధ దొంతరలకు చెందినవారు ఆ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడం శ్లాఘనీయం. బిజెపి ప్రభుత్వం మరోవైపున కార్మిక హక్కులు కాలరాస్తూ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్‌లు తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగాన్నే లేకుండా చేసేలా భారీ పరిశ్రమలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ వగైరా ప్రైవేటీకరణకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కార్మికులు, ఉద్యోగులు సమ్మెలు, ఆందోళనలతో సర్కారును గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. కరోనా విపత్తును ఎదుర్కోవడంలోనూ మోడీ ప్రభుత్వం విఫలమైంది. బహుళజాతి సంస్థలకు ప్రయోజనం కలిగించేలా, మతతత్వాన్ని పెంచి పోషించేలా విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొస్తోంది. ప్రజల మధ్య ఐక్యతను దెబ్బ తీసేందుకు మత విద్వేషాలు పెంచేలా గోగూండాల స్వైర విహారం ఒకవైపు, సిఎఎ, ఎన్‌ఆర్‌సి వంటి చట్ట మార్పులు మరోవైపు సాగిస్తోంది. సంఫ్‌ు పరివార్ శక్తులు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు లౌకిక భావనలకు మద్దతుగా నిలుస్తున్నారు. తమ ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న కేంద్ర బిజెపి విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి ప్రతికూల ఫలితాలు ప్రజాగ్రహానికి ప్రతిబింబాలే !
దేశంలో నేడు వివిధ అంశాలపై ప్రత్యామ్నాయ విధానాలు కావాలంటూ సాగుతున్న ప్రజాందోళనలు, ఉద్యమాలు మరింతగా అభివృద్ధి కావాలి. అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రజా సమూహాల్లో మరింత విశాలంగా విస్తరించి, లోతుగా చొచ్చుకుపోవాలి. ఆ ప్రజా ఉద్యమాల పట్ల, ప్రత్యామ్నాయ విధానాల పట్ల తమ వైఖరులేమిటో ఆయా రాజకీయ పార్టీలు వెల్లడించాలి. ఆ ప్రజా ఉద్యమాలతో మమేకం కావాలి. ఆ క్రమంలో మాత్రమే ప్రస్తుత ప్రభుత్వానికి నికరమైన రాజకీయ ప్రత్యామ్నాయం రూపొందగలదు. ప్రజా ప్రయోజనాలతో నిమిత్తంలేని పొత్తులు, ఎత్తుగడలు నిలబడలేవు. చరిత్ర చెబుతున్న సత్యమిదే !










