
ప్రత్యామ్నాయ పంటల సాగుకు కసరత్తు ఊపందుకుంది. ఈఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాకు వరదాయనులైన తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల్లో నీటికొరత ఏర్పడింది. ఫలితంగా జిల్లాలోని కెసికెనాల్, బ్రహ్మంసాగర్ ఆయకట్టుకు సాగు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయశాఖ జిల్లాలోని 432 ఆర్‌బికెల ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించిన 3,327 క్వింటాళ్లను పొజిషనింగ్ చేసింది. ప్రత్యామ్నాయ పంటల సాగు పట్ల ఆసక్తి కలిగిన రైతులు ఆర్‌బికెలను సంప్రదించి పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సరఫరా చేస్తామని పేర్కొంటున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎ.నాగేశ్వరరావుతో ప్రజాశక్తి ముఖాముఖి...
- ప్రజాశక్తి- కడప ప్రతినిధిఖరీఫ్ సాగు విస్తీర్ణమెంత?
2023-24 ఖరీఫ్ సీజన్ 1,99,509 ఎకరాల సాగు విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఈఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆశించిన రీతిలో పంటల సాగుకు అవకాశం లేకుండా పోయింది.
ఖరీఫ్ సాగు వివరాలు తెలపండి?
2023-24 ఖరీఫ్ సీజన్‌లో 1,99,509 ఎకరాల్లో పంటల సాగుకుగానూ 1,08,798 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈలెక్కన 57 శాతం విస్తీర్ణంలో సాగుకు నోచుకుంది. గతేడాది ఇదే సమయానికి 61 శాతం సాగు కావడం గమన్హార్హం. మిగిలిన సుమారు 90 వేల ఎకరాలను రబీ సీజన్‌లో సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా రబీ సీజన్ బుడ్డశనగ విత్తనాల ప్రతిపాదనల్లో 35 వేల క్వింటాళ్ల నుంచి 75 వేల క్వింటాళ్లకు పెంచడం జరిగింది.
డ్రైస్పెల్స్ దాఖలాలేమైనా ఉన్నాయా?
వైఎస్‌ఆర్ కడప జిల్లాను రబీ ఆధారిత జిల్లాగా పరిగణించాలి. దీనికి గత సాగు చరిత్ర వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో రెండు డ్రైస్పెల్స్ ఘటనలున్నాయి. జూన్, ఆగష్టు మాసాల్లో డ్రైస్పెల్స్ చోటుచేసుకోవడంతోనే సాగులో భారీ వ్యత్యాసం చోటుచేసుకుంది.
ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు తీరు తెలపండి?
జిల్లాలో ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద మినుములు, పెసలు, జొన్న, అలసంద, ఉలవలు, కందుల విత్తనాలను పంపిణీ చేస్తాం. ఇందులో మినుములు 235 క్వింటాళ్లు, పెసలు 58 కందు లు 72, ఉలవలు 200, కౌపి 100 క్వింటాళ్ల చొప్పున పొషజింగ్ ఏర్పాట్లలో నిమగమయ్యాం.
డ్రోన్ టెక్నాలజీ లభ్యత ఎలా ఉంది?
జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున డ్రోన్ అందించాల్సి ఉంది. మొదటి విడతలో భాగంగా 30 మందిని గుర్తించడమైంది. ఇందులో 25 డ్రోన్స్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.
ఇన్సూరెన్స్ సేవల గురించి చెప్పండి?
గ్రామ ఆధారితంగా వరి, జిల్లా ఆధారితంగా కందులు, జొన్న, మినుములు, ఉల్లి, పసుపు, మండల ఆధారితంగా సాగును బట్టి నిమ్మ, వేరుశనగ, పత్తి పంటలను ఎంపిక చేయడమైంది. సంబంధిత రైతుల తరుపున ప్రభుత్వమే నగదు చెల్లించి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతోంది. ప్రకృతి ప్రకోపాల కారణంగా పంట నష్టా లు వాటిల్లినప్పుడు పరిహారం అందించడం జరుగుతుంది.
ఇ-క్రాప్ నమోదు ఎలా ఉంది?
ఇ-క్రాప్ నమోదు వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికి 98 శాతం నమోదుతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నాలుగో స్థానంలో ఉన్నాం. స్వల్ప వ్యవధిలోనే వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం.