Jul 18,2023 23:37

సమావేశంలో కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యే

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : నకరికల్లు నామ్‌ రోడ్డు జంక్షన్‌ - నరసరావుపేట - చిలకలూరిపేట - చీరాల ఓడరేవు వరకు నిర్మించ తలపెట్టిన నాలుగు లైన్ల జాతీయ రహదారి 167-ఎ కు సంబంధించి ఆమోదిత అలైన్మెంట్‌ నరసరావుపేట పట్టణం నుండి వెళుతున్నందున ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని జాతీయ రహదారుల అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ సూచించారు. జాతీయ రహదారి నిర్మాణంపై స్టేక్‌ హోల్డర్స్‌, సంబంధిత అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌.శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో సమీక్షించారు. ఆమోదిత అలైన్మెంట్‌, ప్రత్యామ్నాయ మార్గాలపై జాతీయ రహదారుల శాఖా అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సహజ నీటి వనరులకు, గ్రామ, పట్టణ ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అలైన్మెంట్‌ మార్పు చేసి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. వాటిని స్టేక్‌ హోల్డర్స్‌ అనుమతితో సిద్ధం చేసి ఆమోదం కోసం ప్రభుత్వాలకు పంపాలని చెప్పారు. సమీక్షలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జాతీయ రహదారుల అధికారులు నితీష్‌, వెంకటేశ్వరరావు, జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు, విద్యుత్‌ ఎస్‌ఇ శ్రీనివాసరావు, నరసరావుపేట మున్సిపల్‌ కమిషనర్‌ రాంమోహన్‌, ఆర్‌ అండ్‌ బి ఇఇ రాజానాయక్‌, ఎన్‌ఎస్‌పి ఎస్‌ఇ వరలక్ష్మి పాల్గొన్నారు.