Oct 10,2023 00:37

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి కిరణ్‌

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ప్రత్యామ్నాయ విధానాలతోనే రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి సాధ్యపడుతుందని సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అన్నారు. రాజవొమ్మంగిలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు అధ్యక్షతన సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో కిరణ్‌ మాట్లాడుతూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో రంపచోడవరం ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా రంపచోడవరం, చింతూరు, పోలవరం ఐటిడిఎలను కలిపి రంపచోడవరం కేంద్రంగా మరో ఏజెన్సీ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రంపచోడవరం, చింతూరు, పోలవరం ఏజెన్సీ ప్రాంతాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌, రహదారులు వంటి కనీస మౌలిక సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారన్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు తమ రాజకీయ స్వలాభం కోసం పాకలాడుతున్నారు తప్ప ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కృషి చేయడం లేదని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంత సమస్యలు పరిష్కారం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం సిపిఎం నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు కుమ్మక్కై గిరిజనుల రక్షణ చట్టాలను సవరించి ఆదివాసీలను అడవి నుంచి గెంటేసి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.
జిఒ 3, గిరిజన హక్కులు, చట్టాలు పటిష్ట అమలు, పోడు భూములకు పట్టాలు, ఆదివాసీ స్పెషల్‌ డిఎస్‌సి, జీడిపిక్కల పరిశ్రమ ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, పీహెచ్‌సిల్లో సౌకర్యాలు, ఉపాధి హామీ ద్వారా 200 దినాల పనులు, అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు తదితర సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న రంపచోడవరంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దీనికి వేలాదిగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి బాబురావు, రామరాజు, ప్రజా సంఘాల నాయకులు కె నూకరాజు, ఎం సింహాచలం, పి ప్రసాద్‌, దేవి, నాగమణి, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.