
ప్రజాశక్తి-రోలుగుంట:రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖర గ్రామాలైన నీళ్లబంద, పిత్రిగడ్డలో ప్రత్యామ్నాయ స్కూల్ ఏర్పాటు చేయడం పట్ల గిరిజనులు జిల్లా కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భధంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో 15 కుటుంబాల వారు ఎస్టీ కొందు, ఆదివాసి గిరిజనులు జీవనం సాగిస్తున్నారన్నారు. వీరికి ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాలు మధ్యలో 23 మంది పిల్లలు ఉన్నారన్నారు. చదువు కోవాలంటే ఎనిమిది కిలోమీటర్లు ఎత్తైన కొండ శిఖరం నుండి వైబి.పట్నం ఎలిమెంట్ స్కూల్‌కి రావాల్సి ఉండేదని, పిల్లలు కొండల మధ్య నడుచుకుంటూ రాలేక ఇబ్బందులు పడేవారన్నారు. ఈ విషయమై ఎన్నో సార్లు ఆందోళనలు చేయడం జరిగిందన్నారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ ఈ నెల రెండో తేదీన ఉత్తర్వులు విడుదల చేశారన్నారు. స్కూలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్, మండల సిఆర్పికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పాఠశాల వచ్చేందుకు పోరాటం చేసిన సిపిఎం నాయకులకు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొర్ర సుబ్బారావు, కొర్ర కొండబాబు, చిన్న, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.