Oct 08,2023 21:34

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వి. రాంభూపాల్‌

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్రంలో ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళల పక్షాన పోరాడుతూ సామాజిక న్యాయం, సాధికారత కోసం పనిచేసే ప్రత్యామ్నాయ రాజకీయాలను బలపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు నిర్వహించే సిపిఎం రాజకీయ క్యాంపియన్‌లో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో సిపిఎం నగర కమిటి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంభూపాల్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజలను మళ్లించడం కోసమే సిపిఎం రాజకీయ క్యాంపెయిన్‌ చేస్తోందన్నారు. ప్రశ్నించే వారి గొంతును నరేంద్ర మోడీ ప్రభుత్వం నొక్కుతోందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద దేశద్రోహం చట్టాలను మోపి జైలుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదన్నారు. అధిక ధరలు అరికట్ట లేదని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదని అన్నారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ ధానాన్ని దోచిపెడుతోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తే వారిపై కేసులు బనాయించి బెదిరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయాలు చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. ఈ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం జిల్లాల్లో సదస్సులను పెట్టి ప్రజలను, మేధావులను, రైతులు, కార్మికులు , మహిళలు, నిరుద్యోగులను కలుపుకొని పోయే విధంగా కార్యక్రమాలను సిపిఎం రూపొందిస్తుందని తెలిపారు. సిపిఎం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వి.రామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వెంకట నారాయణ, ముస్కీన్‌, నగర కమిటీ సభ్యులు ప్రకాష్‌, వలీ, మసూద్‌, రాజు, వెంకటేశు, ఎర్రిస్వామి, గపూర్‌, తిరుమలేశు, లక్ష్మీనారాయణ, వరలక్ష్మి, రాముడు, షరీఫ్‌, నాగేంద్ర, కృపమ్మ తదితరులు పాల్గొన్నారు.