ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : వర్షాభావ పరిస్థితుల్లో పత్తి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 70 వేల ఎకరాల వరకు తగ్గిన నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖాధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. ఇందుకు కావాల్సిన విత్తనాలనూ అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం చైర్మన్ సాయి మర్కొండారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా ప్రకారం నల్లరేగడి భూముల్లో మినుము, పెసర, కంది పంటలను సెప్టెంబర్ 15 నుండి సాగు చేసుకోవాలని లేదా అక్టోబర్‌లో శనగ పంటను సాగుకు రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కొద్దిపాటి సాగునీరు సౌకర్యం ఉన్నచోట సెప్టెంబర్, అక్టోబర్‌లో మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ లాంటి పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులు తమ భూమిని ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఆయా పంటలపై రైతులకు ఆదాయం వచ్చేలా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది అవగాహన కల్పిస్తూ ఉండాలని ఆదేశించారు.










