
ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించిన వర్షాలు కురవకుంటే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వైపు దృష్టి సారించాలని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ పివికే జగన్నాధ రావు సూచించారు. ఆర్‌ఏఆర్‌ఎస్ జూబ్లీ హాల్‌లో గురువారం వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులతో శిక్షణ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ఇంతవరకు 435.80 మిల్లీలీటర్లు వర్షం కురవాల్సి ఉండగా 357.80 మిల్లీ లీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైందని చెప్పారు. జిల్లాలో 11 మండలాల్లో 20 నుంచి 60 శాతం తక్కువ వర్షపాతం నమోదు జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వరి నారుమడి దశ, నాటిన తరువాత ఎండిపోవడం జరుగుతుందన్నారు. రానున్న వారం పది రోజుల్లో ఆశించిన వర్షపాతం నమోదు కాకుంటే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివిధ సాగు పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ పంటల గురించి శాస్త్రవేత్త డాక్టర్ కె.వి రమణమూర్తి వ్యవసాయ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కే మోహన్ రావు, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ ఆశా దేవి, జిల్లా ఉద్యానవన అధికారి ప్రభాకర్ రావు, చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిలక్ష్మి, శాస్త్రవేత్తలు ముకుందరావు ,విశాలాక్షి, శ్రీదేవి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.