Oct 25,2022 22:25

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సిఐటియు నేతలు

డిసెంబర్‌ 20, 21 తేదీల్లో అల్లూరి జిల్లాలో నిర్వహణ
కరపత్రాల ఆవిష్కరించిన కార్మిక సంఘం నేతలు
ప్రజాశక్తి -పాడేరు :
డిసెంబర్‌ 20, 21 తేదీల్లో అల్లూరి జిల్లా సిఐటియు మొదటి మహాసభలు జిల్లా కేంద్రమైన పాడేరులో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోనంగి చిన్నయ్య పడాల్‌, ఉమామహేశ్వరరావు వెల్లడించారు. పాడేరు సిఐటియు కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా సిఐటియు జిల్లా మహాసభల కరపత్రాలను జిల్లా ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, ఇతర ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగాం వారు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన అల్లూరి జిల్లాలో జరుగుతున్న మొట్టమొదటి సిఐటియు మహాసభనుప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునేందుఉ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గంపై కక్ష కట్టి, ఒక పథకం ప్రకారం కట్టు బానిసల్లాగా మార్చి, అతి తక్కువ వేతనాలకు పనిచేసే పరిస్థితులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కార్పొరేటికరణ పెరిగి, సంపద కేంద్రీకృతమౌతోందన్నారు. పాలకుల విధానాల వలన ధనవంతులు మరింత ధనవంతులు గాను, పేదవాళ్లు, కార్మికులు మరింత నిరుపేదలుగా మారుతున్నారన్నారు. అంతేకాక నిరుద్యోగం, ఉపాధి లేకపోవడం, అధిక ధరలు, పని గంటలు, పని భారం, ఉపాధి కోతలు, శ్రామిక మహిళలపై లైంగిక వేధింపులు వంటి సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, ఉద్యోగ భద్రత వంటివి ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఎల్‌ఐసి, బ్యాంక్‌లు, విద్యుత్తు, బిఎస్‌ఎన్‌ఎల్‌, స్టీల్‌ప్లాంట్‌ వంటి లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటకు దారాదత్తం చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయన్నారు. ఇప్పటికే స్కీంవర్కర్స్‌, అంగన్వాడీ, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం, ఐకెపి, విఆర్‌ఎలు, పంచాయతీలు, 108, 104, గిరిజన సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, ఐటిడిఎ, ట్రైబల్‌ మ్యూజియం, హెచ్‌ఎంటిసి, ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ, జిసిసి తదితరసంస్థల్లో కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ పద్దతిన పనిచేసే ఉద్యోగులు, కార్మికులతోపాటు, పౌరసరఫరాల కళాసీలు, కాఫీ కార్మికులు, భవన నిర్మాణకార్మికులు, ఆటో కార్మికులు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతకు పోరాటం చేస్తున్నా స్పందన లేదన్నారు. అసంఘటిత కార్మికుల పనిభద్రత, కనీస వేతనం అమలుపై సమగ్ర చట్టం చేయాలని డిఆండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కార్మిక ఉద్యమానికి ఒక మైలురాయిగా సిఐటియు మహాసభలు వేదిక కానున్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, అనంతగిరి, సిపిఎం జెడ్‌పిటిసి దీసరి గంగరాజు, లింగేరి సుందరరావు, కె.భాగ్యలక్ష్మి, వై, అప్పలనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శులు, శెట్టి నాగరాజు, వై మంగమ్మ, భీమరాజు పాల్గొన్నారు.