Jul 15,2023 21:01

ప్రతిపక్షమా..! నువ్వెక్కడ

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  జిల్లాలో ప్రతిపక్ష పార్టీ ఉనికిపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసలు ఉందా? లేదా? అంటూ పలువురు ఒకింత హాస్యాస్పద సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ప్రతిపక్ష పార్టీ ఉందనుకున్నా ప్రతిపక్షం అనే పాత్రపోషించలేక పోతుందని మరికొందరు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రభుత్వం చర్యలు, జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తిప్పికొట్టడంలో టిడిపి పూర్తిగా విఫలమైంది. ప్రతి నియోజకవర్గంలోనూ అంతర్గతపోరే ఇందుకు కారణమన్న చర్చ బాహాటంగానే సాగుతోంది. ముఖ్యంగా చెరకు రైతుల సమస్యపై అధికార పార్టీ నోరు మొదపడం లేదు. భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీ మూసేయడమే కాకుండా రైతులు సాగు తగ్గించుకోవడం వల్లే ఫ్యాక్టరీ తెరవలేకపోతున్నామంటూ బుకాయించినా మూగబోయిన ప్రతిపక్షం నోరు తెరుచుకోలేదు. దీంతో, చెరకును గత్యంతరం లేని పరిస్థితుల్లో 40 నుంచి 70కిలోమీటర్ల దూరంలోవున్న సంకిలికి తరలించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఎస్‌.కోట నియోజకవర్గ వ్యాప్తంగా భూకబ్జాలు జరిగాయంటూ సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రఘురాజు బహిరంగంగా ప్రకటించినప్పటికీ అక్కడి టిడిపి నేతలు కిమ్మనలేదు. ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొచ్చినా ఇప్పటికీ శివారు ఆయుకట్టుకు నీరందించాలని మాట్లాడలేదు. మరోవైపు 1.21లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన తోటపల్లి ద్వారా 80వేలకు మించి సాగునీరు అందే పరిస్థితి లేదని సాక్షాత్తు ఇరిగేషన్‌ శాఖ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. తోటపల్లి, తారకరామ తీర్థసాగర్‌ నిర్వాసితులు నష్టపరిహారం పునరావాసం కోసం ఆందోళన చెందుతున్నా పట్టించుకోలేదు. అటు మన్యం జిల్లాలో జీడిరైతుల అందోళన అక్కడి టిడిపి నాయకులకు పట్టలేదు. ఇటీవల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు 36గంటల మహాధర్నా చేపట్టిన విషయం విధితమే. వేలాది సంఖ్యలో తరలివచ్చిన అంగన్‌వాడీలు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అనేక ప్రజా, కార్మిక, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేసినప్పటికీ టిడిపి, వాటి అనుబంధ సంఘాల పత్తా కనిపించలేదు. దీంతో, గతంలో అంగన్‌వాడీల ఆందోళన సందర్భంగా టిడిపి ప్రభుత్వం గుర్రాలతో తొక్కించిన సందర్భాన్ని పలువురు గుర్తుచేశారు. ఇలా ఒకటా? రెండా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడంలో ప్రతిపక్ష హోదాలోవున్న టిడిపి పూర్తిగా విఫలమైంది. పైగా అంతర్గత విభేదాలతో జిల్లా పార్టీ కొట్టుమిట్టాడుతోంది. బొబ్బిలి మినహా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ రెండుగా చీలి వుంది. జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, స్థానిక మాజీ ఎమ్మెల్యే గీతను కలుపుకుని ముందుకు వెళ్లేందుకు సాహశించడం లేదు. దీంతో, గీత ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడిని కూడా అశోక్‌ గజపతిరాజు టార్గెట్‌ చేశారన్న చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే కరణం శివరామకృష్ణ ఆ నియోజకవర్గంలో ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెఎ నాయుడు శ్రీకాకుళం మండలం ఎచ్చెర్లకు చెందిన మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు ఆశీస్సులతో ముందుకు సాగుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కలిశెట్టి అప్పలనాయుడు చేస్తున్న పార్టీ కార్యకలాపాలు కళావెంకటరావుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రాజాంలో మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి కళావెంకటరావు గ్రూపులోనూ, కోండ్రు మురళి అశోక్‌ గజపతిరాజు గ్రూపులోనూ ఉన్నారు. ఎస్‌.కోటలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైనా గొంపకృష్ణ మధ్య పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. భోగాపురంలో కర్రోతు బంగార్రాజుకు ఇటీవల సీటు ఖరారైనట్టు ప్రచారం జరగడంతో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామితోపాటు మరో నేత అంతర్గతంగా మదన పడుతున్నట్టుగా చర్చ నడుస్తోంది. చీపురుపల్లిలో చీలికలేవీ కనిపించకపోయినప్పటికీ ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న కిమిడి నాగార్జున జిల్లా పార్టీ సారధి పాత్రపోషించలేకపోతున్నారని చర్చ నడుస్తోంది. గ్రూపులను నివారించకపోవడం ఇందుకు కారణం. అటు మన్యం జిల్లా సాలూరులో మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ల మధ్య అంతర్గత యుద్ధం కొనసాగుతోంది. కురుపాంలో దత్తిలక్ష్మణరావు గ్రూపులు కడుతున్నారన్న చర్చ సాక్షాత్తు ఇటీవల చంద్రబాబు సమక్షంలోనే జరిగిన పంచాయతీలో తేలింది. పార్వతీపురంలో టిడిపి నాయకులు ఏకంగా వైసిపి నాయకులతోనే కుమ్మకయ్యారనే ప్రచారం నడుస్తోంది. ఇలా వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం కొందరు, ఉనికి కోసం మరికొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాసమస్యలు, ప్రభుత్వ తప్పిదాలను, ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరును పట్టించుకోక పోవడంతో జిల్లాలో ప్రతిపక్షం ఉందా? లేదా? అంటూ ప్రజానీకం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కూడా జనం చర్చించుకుంటున్నారు.