Oct 12,2023 21:18

ప్రజాశక్తి - పాలకోడేరు
ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు అని, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్‌ అన్నారు. కొండేపూడిలో ఎంపిపి భూపతిరాజు సత్య నారాయణరాజు (చంటి రాజు) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి చంటిరాజు, కొండెపూడి, వేండ్ర అగ్రహారాల సర్పంచులు చింతపల్లి వెంకట సత్యనారాయణ (చిన్న) కడలి విజయలక్ష్మితో కలిసి ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్‌ గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో రూ.15 వందల కోట్ల నుంచి రూ.2 వేల ఓట్ల వరకూ సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌ చెప్పే అబద్ధాలు నమ్మొద్దన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి జగన్‌ పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీకి అండగా ఉండి పివిఎల్‌ నరసింహరాజును ఎంఎల్‌ఎగా గెలిపించాలన్నారు. ఎంపిపి చంటిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు వంశీకృష్ణంరాజు, బోల్ల శ్రీనివాస్‌, వెండ్ర సర్పంచి కడలి నాగేశ్వరి, ఎఎంసి వైస్‌ ఛైౖర్మన్‌ రాజా నరేంద్రకుమార్‌, ఎంపిడిఒ మురళీ గంగాధరరావు, తహశీల్దార్‌ షేక్‌ హుస్సేన్‌, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి పోలయ్య, నాయకులు బి.రాంబాబు, కటిక శ్రీదేవి, సోడదాశి నరేష్‌, లక్ష్మీతులసి, పాల శ్రీను, కొండలరావు, చింతపల్లి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, సత్యనారాయణ, వేణు, రమణ, నాగరాజు, శ్రీను పాల్గొన్నారు.