Aug 14,2023 22:25

మృతుని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న రవికుమార్‌

* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌
ప్రజాశక్తి - పొందూరు: 
ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ప్రజల నుంచి గుణపాఠం తప్పదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో టిడిపి సానుభూతిపరుల కుటుంబాలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న చంద్రబాబునాయుడుపై ముఖ్యమంత్రి దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. వైసిపి వారే దాడి చేసి తిరిగి ప్రతిపక్ష నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఎంతో స్వేచ్ఛగా పాదయాత్ర చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షాలపై అణచివేత ధోరణికి పాల్పడడం, దాడులు చేయడం ఆయన ఫ్యాక్షన్‌ నైజానికి నిదర్శనమన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఆలోచిస్తే జగన్‌ పాదయాత్ర చేయగలిగేవారా అని ప్రశ్నించారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షులు చిగిలిపల్లి రామ్మోహన్‌, ఉపాధ్యక్షుడు బాడాన శేషగిరినాయుడు, జిల్లా కార్యదర్శి సీపాన శ్రీరంగానాయకులు, పట్టణాధ్యక్షులు అనకాపల్లి శ్రీరంగ, కొంచాడ అప్పలనాయుడు తదితరులున్నారు.