ప్రజాశక్తి - పెద్దాపురం స్పందనలో వచ్చిన ఆక్రమణ తొలగింపు ఫిర్యాదుపై మున్సిపల్ అధికారులు అత్యుత్సాహంగా కదిలి హడావిడి చేయటం ఏమిటని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను నిలదీశారు. శుక్రవారం చైర్‌పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్‌లు ఆరేళ్ల వీర రాఘవ, విడదాసరి రాజా, పప్పల దుర్గారావు మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు దర్గా సెంటర్‌లో ఆక్రమణ తొలగించాలని ఫిర్యాదు చేస్తే మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వెళ్లి అత్యుత్సాహంతో హడావుడి చేయటం ఏమిటని మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లను నిలదీశారు. దీనిపై కమిషనర్ జె.సురేంద్ర వివరణ ఇస్తూ ప్రభుత్వ స్థలం ఆక్రమణ జరుగుతుందని స్పందనలో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్గా సెంటర్‌లో బస్సు షెల్టర్ ప్రాంతాన్ని పరిశీలించామన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, డిఇ ఆదినారాయణ రావు పాల్గొన్నారు.










