ప్రజాశక్తి-పాడేరు:గిరిజనుల మనుగడను దెబ్బతీసే అల్లూరి జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. స్థానిక గిరిజన భవన్‌లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ బాధిత గ్రామాల గిరిజనులతో శుక్రవారం గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి.లక్కు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స మాట్లాడుతూ, ఎర్రవరం, పెదకోట, చిట్టంపాడు, గుజ్జెలి ప్రాంతాల్లో సుమారు 5100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయించారని, ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్)ను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి కార్పొరేట్ కంపెనీలకు అటవీ సంపదను దోచి పెట్టడానికి ఆయా ప్రాంతాల్లో 8 డ్యాముల నిర్మాణానికి సన్నద్ధం అవుతున్నారన్నారు. ఎర్రవరం, పెదకోట, గుజ్జెలీ, చిట్టంపాడు హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో సుమారు 100 గ్రామాలలో 15వేలమంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతారన్నారు. సాగులో వున్న వ్యవసాయ భూమి సుమారు 5000 ఎకరాలు, అటవీ భూమి సుమారు 12000 ఎకరాలు నష్టపోతారన్నారు. కాఫీ, పసుపు, ఫైనాపిల్, జామ, సీకాయ, కుంకుపూడి, చింతపండు, అడ్డాకులు, దుంపలు తదితర అటవీ ఉత్పత్తులు కోల్పోయి గిరిజనుల జీవనాధారం సర్వనాశనం అవుతుందని తెలిపారు.ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతమంతా రిజర్వు ఫారెస్టు, పోడు వ్యవసాయం, జిరాయితీ భూమితో పాటు ఉమ్మడి, అటవీ వ్యవసాయ యాజమాన్య హక్కులు అదివాసులకు కలిగి ఉన్నాయని చెప్పారు. రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీ హక్కుల కమిటీ, (టిఏసీ) తీర్మానం పొందాల్సి ఉందన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రామసభ, ఎఫ్‌ఆర్‌సి తీర్మానం ఆమోదం లేదన్నారు. గ్రామ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెకుల్ట ఏర్పాటుపై ప్రకటన జారీ చేయడం తగదన్నారు. గిరిజన సలహా మండలి (టిఎసి)ని సంప్రదించకుండా ప్రాజెక్టులపై రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం రాజ్యాంగ ధిక్కరణే అవుతుందని గుర్తు చేశారు.బాక్సైట్ తరహాలోనే హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు గిరిజనుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని విమర్శించారు.ఎర్రవరం, పెదకోట ప్రాంతంలో పారే నీటితోనే విద్యుత్ ఉత్పత్తి కోసం 4 యూనిట్ల చొప్పున లోయర్ డ్యామ్, అప్పర్ డ్యామ్ నిర్మించడంతో రైవాడ, తాండవ ఆయకట్టు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందని ద్రాక్షగా మారుతాయని తెలిపారు. విశాఖపట్నం ప్రజలకు రైవాడ నుండే తాగునీరని, ఈ నీళ్లు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు మళ్లీంచడంతో పారిశ్రామిక అవసరాలకు, ప్రజల తాగునీరుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. స్థానిక ప్రజలకు తెలియకుండా రహస్యంగా గత రెండు సంవత్సరాల నుంచి అటవీ ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించడం దారుణమన్నారు. తక్షణమే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె. పృధ్వీ రాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు పి. ధనుంజరు, ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక కమిటీ నాయకులూ రామకృష్ణ పడల్, పేదకోట నాయకులు సింహాచలం, ఈశ్వరరావు, చిట్టంపాడు నాయకులు చంద్రరావు, గిరిజనులు పాల్గొన్నారు.










