Oct 03,2023 16:04

జగనన్న ఆరోగ్య సురక్షలో ఎంఎల్‌ఎ వాసుబాబు
ప్రజాశక్తి - భీమడోలు
   జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలులో భాగంగా నిర్వహించిన ఇంటింటా సర్వేలో నమోదైన ప్రతిఒక్కరూ వైద్య సేవలు వినియోగించుకొని, ఆరోగ్యవంతులుగా ఇంటికి చేరవచ్చునని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు తెలిపారు. భీమడోలు గ్రామ సచివాలయం-1 పరిధిలో మంగళవారం నిర్వహించిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం క్యాంపును ఆయన ప్రారంభించారు. సర్పంచి పి.సునీత మాన్సింగ్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎల్‌ఎ మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని 6 వేల మంది జనాభాలో 400 మంది వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి, వారి చికిత్స కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ దశల వారీగా నిర్వహించిన ఇంటింటా సర్వే సందర్భంగా అనారోగ్యంతో ఇబ్బందిపడే వారిని గుర్తించామన్నారు. వారికి పూర్తిస్థాయి వైద్య సేవలు ఉచితంగా అందుతాయన్నారు. అవసరం మేరకు ఆరోగ్యశ్రీని ఉపయోగించి కార్పొరేట్‌ వైద్యం వారికి అందుబాటులో ఉంటుందన్నారు. క్యాంపులో పాల్గొన్న నలుగురు స్పెషలిస్ట్‌ వైద్యుల్లో ఇద్దరు పిహెచ్‌సి వైద్యులు వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలి, జెడ్‌పిటిసి తుమ్మగుంట భవాని రంగా, ఎంపిపి కనుమాల రామయ్య, ఎఎంసి ఛైర్‌పర్సన్‌ ఇంజేటి నీలిమ జూనియర్‌ పాల్గొన్నారు.